India Pakistan Ceasefire : భారతదేశం, పాకిస్తాన్ మధ్య శాంతికి తాను మధ్యవర్తిత్వం వహించానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ అంశంపై యూ-టర్న్ తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు తాను పూర్తి క్రెడిట్‌ను పొందాలని కోరుకోవడం లేదని, కానీ శత్రుత్వాన్ని ఆపడంలో తన పాత్ర ఉందని నమ్ముతున్నానని అన్నారు.
"నేను చెప్పానని నేను చెప్పదలచుకోలేదు, కానీ గత వారం పాకిస్తాన్ - భారతదేశం మధ్య సమస్య పరిష్కారానికి నేను సహాయం చేశాను. అది మరింత ప్రమాదకరంగా మారుతూ ఉంది. అకస్మాత్తుగా క్షిపణులను చూశారు. కానీ మేము దానిని పరిష్కరించాము" అని ట్రంప్ అన్నారు.
'భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి ప్రమాదకరంగా మారింది'
వాణిజ్యంపై చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తన స్టాెండ్‌ను మరోసారి కంటిన్యూ చేశారు. వాణిజ్యం గురించి మాట్లాడినప్పుడే ఈ విషయం పరిష్కారమైందని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశం- పాకిస్తాన్ రెండూ దేశాలు కూడా యుద్ధం కాకుండా వ్యాపారం చేయాలని తాను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పారు. వాణిజ్యం గురించి చర్చతో పాకిస్తాన్ భారతదేశం చాలా సంతోషంగా ఉన్నాయని, వారు అందుకు తగ్గట్టుగానే ఉన్నారని ఆయన అన్నారు.
"నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్లి రెండు రోజుల వరకు అది పరిష్కారం కాలేదని మీకు తెలుసు. కానీ అది పరిష్కరమైంది. మేము వారితో వాణిజ్యం గురించి మాట్లాడాము. [యుద్ధం] బదులుగా వాణిజ్యం చేద్దాం. పాకిస్తాన్ దానితో చాలా సంతోషంగా ఉంది. భారత్ కూడా చాలా సంతోషంగా ఉంది. వారు అదే పనిలో ఉన్నారని నేను భావిస్తున్నాను" అని అమెరికా అధ్యక్షుడు ఇంకా జోడించారు.
"వారు దాదాపు 1000 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. కాబట్టి నేను దాన్ని పరిష్కరించగలను. నేను పరిష్కరిస్తాను; వారిని ఒకటిగా చేద్దాం. మీరు సుమారు 1000 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం పోరాడతారు? ఓహ్, అది చాలా ఎక్కువ. నాకు దాని గురించి కచ్చితంగా తెలియదు. సెటిల్ చేయడంపై కూడా కచ్చితంగా చెప్పలేను. అది కఠినమైంది. వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇది నిజంగా నియంత్రణ లేకుండా పోయేదే" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
కాల్పుల విరామానికి ట్రంప్ తనకు క్రెడిట్ ఇచ్చుకున్నారు
మే 10న భారత్ -పాకిస్తాన్ మధ్య కాల్పుల విరామం ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనికి తనకు క్రెడిట్ ఇచ్చుకున్నారు. "భారత్ -పాకిస్తాన్ తక్షణ యుద్ధవిరామంపై అంగీకరించాయని ప్రకటించడం ఆనందంగా ఉంది. రెండు దేశాలు తెలివిగా వ్యవహరించాయ" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ ఈ వాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది.
ట్రంప్ వాదనను భారత్ తిరస్కరించింది
పాకిస్తాన్‌తో ఉద్రిక్తత సమయంలో జరిగిన చర్చల సందర్భంగా అమెరికాతో ఎలాంటి వాణిజ్య అంశాలు లేవనెత్తలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత మే 11న ట్రంప్, "భారత్ -పాకిస్తాన్ యొక్క బలమైన నాయకత్వంపై నాకు చాలా గర్వంగా ఉంది, వారు శక్తి,, తెలివి, ధైర్యంతో ప్రస్తుత ఉద్రిక్తతలను ఆపడానికి సమయం వచ్చిందని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్రిక్తత లక్షలాది మంది ప్రజల మరణానికి , విధ్వంసానికి కారణం కావచ్చు" అని అన్నారు.
మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ పదే పదే చెబుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వాదన ప్రకారం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి.