Parliament Winter Session LIVE: సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం.. ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేసేందుకు బిల్లును నేడు కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం ఉభయసభలు రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదాపడ్డాయి.
నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం పలికింది. విపక్షాల నిరసనల మధ్యే బిల్లును ఆమోదించారు. ఈరోజు ఉదయం లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం పలికింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది లోక్‌సభ. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే బిల్లుకు ఆమోదం పలికారు.
లోక్‌సభ తిరిగి ప్రారంభమైన వెంటనే నూతన సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు.
లోక్‌సభ ప్రారంభంకాగానే వివిధ అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్షాల నిరసనలతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
Background
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 26 బిల్లులను తీసుకొచ్చేందుకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సభలో అందరి సహకారంతో బిల్లులను గట్టెక్కించాలని భావిస్తోంది. తొలిరోజునే సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పలు అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయనే నమ్మకం తనకు ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సమావేశాలు మొదలయ్యే ముందు ట్వీట్ చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్షాలకు సభను సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్లమెంట్లో సభామర్యాదను పాటించాలన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -