Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో వందకుపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మరిన్ని సమస్యలు చర్చకు వచ్చాయి. అధికారులు, మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh News: "సూటిగా... సుత్తి లేకుండా... విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి" అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు, మంత్రులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. అప్పుడే నిజమైన సమస్యలు వాటి పరిష్కార మార్గాలు తెలుస్తాయని సూచించారు. ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు తెలియవని, పరిష్కార మార్గాలపై అవగాహన రాదని తెలిపారు.
అభివృద్ధి రాజకీయం రెండూ సమానంగా సాగలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎక్కడ కూడా అధికారులకు ఇబ్బంది పెట్టే పనులు చేయడం మంచిది కాదని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారు. తప్పుడు పనులు ప్రోత్సహించకుండా ప్రజాప్రతినిధి చెప్పే సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అలానే అమలు చేయకుండా మంచిది ఏదో ఆ ప్రాంతానికి ఏది సరిపోతుందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఏదైనా పని కాలేదని తెలిస్తే వెంటనే స్పందించాలని నేరుగా బాధితులను కలవాలని సూచించారు. మంచి జరిగినప్పుడు ప్రజలకు తెలియజేయడానికి కూడా ముందుకు రావాలని సూచించారు. దాని ఘనత రాజకీయాలకు కూడా ఇవ్వాలని హితవుపలికారు. దీని వల్ల పని చేశామన్న సంతృప్తి కలెక్టర్లకు, ఐదేళ్ల తర్వాత ఓట్లు అడిగేందుకు వెళ్లే ప్రజాప్రతినిధికి ఇద్దరికీ బెనిఫిట్ ఉంటుందన్నారు.
కల్చరల్ కేంద్రంగా విశాఖ, తిరుపతి
రాష్ట్ర వారసత్వ కళ అయిన కూచిపూడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అన్ని స్కూల్స్, కాలేజీల్లో ప్రదర్శనలు ఇప్పించాలని తెలిపారు. విశాఖ, తిరుపతి కేంద్రాల్లో ప్రత్యేక కల్చరల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడ దాదాపు 2000 మంది పట్టేలా చూడాలన్నారు. విశాఖ కేంద్రానికి సుశీల పేరు, తిరుపతి కేంద్రానికి ఘంటసాల లేదా బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంబేద్కర్ ఆడిటోరియం ఉందని గుర్తు చేశారు.
అన్ని పనులు డబ్బులతోనే కావు
అన్ని పనులు డబ్బులతోనే చేయాలనే ఆలోచన నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. స్మార్ట్ వర్క్ చేస్తే కొన్ని పనులు పూర్తి అవుతాయన్నారు. గత ఐదేళ్ల విధ్వంసం పాలనతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాష్ట్రానికి 9.77 లక్షల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. అందుకే సూపర్ సిక్స్ అమలులో ఆలస్యమవుతుందన్నారు. అయినా వెనక్కి తగ్గడం లేదని తెలిపారు.
ఉగాది నుంచి పీ 4 అమలు
కొత్తగా అమలు చేయనున్న పీ4 విధానంతో చాలా మార్పులు చూస్తామన్నారు చంద్రబాబు. దీని వల్ల ప్రజల జీవన విధానం మారుతుందని తెలియజేశారు. దీన్ని ఉగాది నుంచి ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. ఈ విధానంలో భాగంగా సీమని ఉద్యానవన హబ్‌గా, పంప్డ్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీకి హబ్‌గా మారుస్తామని తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ఎనర్జీ ప్యానెల్ ఉండేలలా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
నాలా రద్దు
నాలా చట్టం కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదిస్తామని వివరించారు. దీని వల్ల పెట్టుబడులు పెట్టేవాళ్లకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ రెండు రోజుల పాటు 22 గంటలు పాటు సమావేశాలు చర్చలు జరిగాయి. 600 స్లైడ్స్ అధికారులు ప్రదర్శించారు. 150 రకాల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సదస్సులో దాదాపు 100 సమస్యలకు పరిష్కారం లభించిందని ప్రభుత్వం ప్రకటించింది.
వచ్చే సమావేశంలో ప్రజంటెషన్లు ఉండవని ఇప్పటి వరకు ఇచ్చిన టాస్క్‌లపై ప్రశ్నలు సమాధానాలే ఉంటాయని చంద్రబాబు ప్రకటించారు. ఈ సదస్సులో కూడా చంద్రబాబు చాలా సూటిగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. భారీ ప్రజెంటేషన్లు ఇస్తున్నవాళ్లను వారించి సూటిగా చెప్పాలని చెప్పారు. అధికారులతోపాటు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. తన దగ్గర విజ్ఞాన ప్రదర్శనలు చేయొద్దని సూచించారు. నేరుగా సమస్య వివరించి దానికి పరిష్కార మార్గాలు, చేపట్టబోయే యాక్షన్ ప్లాన్ మాత్రం చెప్పాలన్నారు.