Pastor Praveen Pagadala: ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఏపీలో దుమారం రేపుతోంది. ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు భగ్గుమంటున్నారు. రాజమండ్రికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. పాస్టర్ అనుమానాస్పద మృతిపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు పాస్టర్ ప్రవీణ్ రాత్రి బైకు మీద రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎస్పీకి ఫోన్ చేసి హోం మంత్రి ఆరా
అమరావతి: పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతి కేసులో ఆరోపణలపై హోంమంత్రి అనిత స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి పాస్టర్ అనుమానాస్పద మృతిపై ఆరా తీశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు సేకరించి, అసలేం జరిగిందో పరిశీలించాలని హోంమంత్రి ఆదేశించారు. క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్ చేసినట్లు హోంమంత్రికి ఎస్పీ తెలిపారు.
నారా లోకేష్ దిగ్భ్రాంతి
పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం మంత్రి నారా లోకేష్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. కానీ పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు.
...విద్య, ఐటి శాఖల మంత్రి
హైదరాబాద్ నుంచి బైకు మీద రాజమండ్రికి.. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ లో పాస్టర్ గా చేస్తున్నారు. ఆయన బైక్ మీద రాజమండ్రికి వెళ్లారు. ఈ క్రమంలో కొంతమూరు హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. రాజమండ్రిలో ఎలాంటి కార్యక్రమాలు లేకున్నా ఆయనకు అక్కడికి ఎందుకు వెళ్లారు అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రవీణ్ పగడాల మృతదేహంపై గాయాలు ఉండటంతో పాస్టర్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని పాస్టర్ సంఘాలు, క్రైస్తవులు డిమాండ్ చేశారు. ప్రవీణ్ మృతికి టాలీవుడ్ నటుడు రాజా కూడా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
రాజమండ్రికి ఎందుకు వచ్చారు, ఎవరిని కలిశారు.. హైదరాబాద్ నుంచి బైకు మీద రాజమండ్రికి ఎందుకు వచ్చారు.. అందులోకూ బైక్ పై ఎందుకు అనే విషయాలపై పోలీసులు ఫోకస్ చేశారు. ప్రవీణ్ పగడాల అనుచరులు, స్నేహితులు, పాస్టర్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కచ్చితంగా హత్యేనని, ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి శిక్షించాలని క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదేశాలతో పోస్టుమార్గం ప్రక్రియను వీడియో రికార్డు చేశారు. తన ప్రాణానికి హాని ఉందని నెలరోజుల క్రితమే ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సమాచారం. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ప్రవీణ్ ను హత్య చేశారని పాస్టర్లు ఆరోపిస్తున్నారు.