Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 

Kishan Reddy Letter To Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హెచ్‌సీయూ వద్ద భూముల వేలం ప్రక్రియను ఆపాలనిడిమాండ్ చేశారు.

Continues below advertisement

Kishan Reddy Wrote A Letter To Revanth Reddy: హెచ్‌సీయూ వద్ద ప్రభుత్వానికి దక్కిన 400 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం నిర్ణయం పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ముక్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ భూములను వేలం వేయొద్దని సూచించారు. హెచ్‌సీయూలో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 

Continues below advertisement

ఆర్థిక వనరుల సమీకరణ కోసం కంచ గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందన్నారు కిషన్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నాని పేర్కొన్నారు.  ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు నష్టం చేసినట్టు అవుతుందని ప్రజలకు ఏమైనా చేయాలన్నా భూములు లేకుండా పోతాయని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ప్రస్తావించారు. 

ఇప్పుడు ప్రభుత్వం వేలం వేయడానికి చూస్తున్న భూమిలో అనేక వృక్షాలు, జంతువులు, సరస్సులు ఉన్నాయని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులు, నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు ఉన్నాయని  అన్నారు. ఈ భూమి పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో కూడి ఉందన్నారు. అలాంటి పచ్చని భూమిలో కాంక్రీట్ నిర్మాణాలు చేపడతామని ప్రతిపాదనలు చేయడం ఏంటని నిలదీశారు. ఇక్కడ పర్యావరణానికి ముప్పుకలిగితే అది నగరానికి చేటు అని హెచ్చరించారు. 
హైదరాబాద్‌లో ఒకప్పుడు అడవులు కొండలు ఉండేవని పట్టణీకరణతో ఇప్పుడు కాంక్రీట్ అడవిలాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్థిక వనరుల పేరిట  పచ్చని భూములను కూడా కాంక్రీట్ జంగిల్స్‌గా మార్చడాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు. హైదరాబాద్‌లో పచ్చదనం తగ్గిపోతోందని భవిష్యత్‌ తరాల కోసం స్థలాలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.  

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వం భూమి అని దీనికి హెచ్‌సీయూకి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భూమిలో ఎలాంటి బఫెలో లేక్ , పికాక్ లేక్ లాంటివి లేవని స్పష్టం చేశారు. రాతి నిర్మాణాలు, పుట్టగొడుగు ఆకారపు అపురూపమైన రాయిని గ్రీన్ జోన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్‌ డిస్కషన్ సందర్భంగా ఈ గచ్చిబౌలిలో వివాదాస్పద భూమిపై మాట్లాడారు. అక్కడ ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. అక్కడ రిజర్వ్​ ఫారెస్ట్ లేదని  జింకలు, పులులు, సింహాలు లేవని తెలిపారు. కానీ అక్కడ కొన్ని గుంట నక్కలు చేరి ఇలా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దానిని డెవలప్‌మెంట్‌కు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. గుట్టుగా ఎవరికీ కట్టబెట్టలేదని ఓపెన్​ ఆక్షన్​ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చేలా చేస్తున్నామని వివరించారు. యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి సంబంధించి విషయాల్లో భూసేకరణ చేస్తే అడ్డంకులు సృష్టించొద్దని సూచించారు. 

Continues below advertisement