Scholarships: ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలోని విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

Fee Reimbursement and Scholarships 2025: తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 31 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ గడువు మార్చి 31తో ముగియనుంది. అయితే మరో మూడునెలలపాటు పొడిగించింది. ఇప్పటికే డిసెంబరు 31తో ముగియాల్సిన గడువును తర్వాత జనవరి 31 వరకు, ఆ తదుపరి మార్చి 31కి వరకు మరోసారి పొడిగించింది. తాజాగా మరోసారి అవకాశం కల్పించింది.

Continues below advertisement

కొన్ని ప్రొఫెషనల్‌ కోర్సుల ప్రవేశాలు ఆలస్యం కాగా, ఆయా ప్రవేశాల సమాచారం ప్రభుత్వానికి రావడంలో ఆలస్యమైంది. దీంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దాదాపు 5 లక్షల మందికిపైగా ఉంటారని అంచనా. ఇప్పటికి 10 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యాసంవత్సరానికి 11,88,120 మంది విద్యార్థులకు గాను 10,34,074 మంది దరఖాస్తు చేశారు. 

ఎంబీబీఎస్, పీజీ మెడికల్ ప్రవేశాలు ఇంకా పూర్తికానందున విద్యార్థుల వివరాలను కాళోజీ వర్సిటీ ఎస్సీ సంక్షేమశాఖకు ఇవ్వలేదు. వివరాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు దరఖాస్తు చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 31 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా కళాశాలల యాజమాన్యాలు మే 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.  

 

Continues below advertisement