Mulayam Singh Yadav Death: 10 సార్లు శాసనసభ్యడిగా, ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు ముఖ్యంత్రిగా, ఒకసారి కేంద్రమంత్రిగా.. ఇలా దాదాపు 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జాతీయ స్థాయి వరకు ఎదిగింది. రాష్ట్రం నుంచే కేంద్రంలో చక్రం తిప్పిన నేతల్లో ఆయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఆయనే రాజకీయ కురువృద్ధుడు, కాకలు తీరిన యోధుడు.. ములాయం సింగ్ యాదవ్.
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్యాలతో చాలా రోజుల నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ములాయం.. ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.
ముఖ్యమంత్రిగా ఉత్తర్‌ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు. యూపీలో అనేక సంస్కరణలను పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అలాంటి నేత గురించి కీలక విషయాలు తెలుసుకుందాం.
రెజ్లింగ్ రింగ్ నుంచి అసెంబ్లీకి
విద్యార్థిగా ఉంటూనే కుస్తీ పోటీల్లో పాల్గొని మల్లయోధుడుగా పేరొందారు ములాయం సింగ్ యాదవ్. ఎక్కడ పోటీకెళ్ళినా ఆయనే విజేత. 14 ఏళ్ళ వయసులో 1953లో వ్యవసాయ నీటి పన్ను పెంపుదలకు వ్యతిరేకంగా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేపట్టిన ఆందోళనలో పాల్గొని అరెస్టయి నెల రోజులు జైల్లో ఉన్నారు ములాయం.
అలా రాజకీయ ప్రజాజీవితంలో ప్రవేశించిన ములాయం సింగ్ యాదవ్ ఇప్పటి వరకూ 11 అసెంబ్లీ ఎన్నికల్లో, 7 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 18 సార్లు పోటీ చేశారు. 16 సార్లు గెలిచారు. 1967లో 27 ఏళ్ళ వయసులో తన సొంత నియోజకవర్గం జశ్వంత్ పుర్ అసెంబ్లీకి తొలిసారి పోటీ చేసి గెలిచారు. తన రాజకీయ గురువు, మార్గదర్శి రామ్ మనోహర్ లోహియా ప్రోత్సాహంతో ఆయన పార్టీ సంయుక్త సోషలిస్టు పార్టీ టికెట్‌పైనే ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళల్లో ములాయమే చిన్న వయస్కుడు.
ఇందిరాపై పోరు
ఆరు దశాబ్దాల ములాయం రాజకీయం ఏడు రాజకీయ పార్టీలలో గడిచింది. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కడా మత తత్వ పార్టీ వైపు గానీ, సుధీర్ఘ కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ వైపు గానీ మరలలేదు. 1967లో గురువు లోహియా మరణంతో సోషలిస్టు పార్టీ చీలికలు పేలికలైంది. ములాయంకు రాజకీయ నిర్ధేశకత్వం కొరవడింది. ఈ దశలో ఆయన రైతు నాయకుడు, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తర్వాత దేశ ప్రధానిగా పని చేసిన చౌదరీ చరణ్ సింగ్ నాయకత్వంలో పని చేయలని నిర్ణయించుకున్నారు. చరణ్ సింగ్ పార్టీ భారతీయ లోక్ దళ్ తో పాటు పలు పార్టీలు 1977లో ఇందిరను ఓడించడానికి జనతా పార్టీగా ఏకమయ్యాయి. ఆ సమయంలో ఎమర్జెన్సీని బలంగా వ్యతిరేకించిన నేతల్లో ములాయం ఒకరు. 1977లో దేశంలో పాటు ఉత్తర్‌ప్రదేశ్ లో కూడా రామ్ నరేష్ యాదవ్ నాయకత్వంలో జనతా పార్టీ విజయం సాధించింది. రామ్ నరేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రి వర్గంలో మొదటి సారి సహకార శాఖా మంత్రి పదవి చేపట్టారు. ఇందిర 1980లో మళ్ళీ ప్రధానై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో జరిగిన ఉపఎన్నికలో ములాయం ఓడిపోయారు. ఇది ఆయనకు రెండో ఓటమి.
తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో చరణ్ సింగ్ ప్రోత్సాహంతో ఆయన పోటీ చేసి ఎన్నికై మండలిలో లోక్ దళ్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకయ్యారు. అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. 1985 యూపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ఈ సారి 425 స్థానాలున్న అసెంబ్లీకి లోక్ దళ్ పార్టీ నుంచి 86 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీలో లోక్ దళ్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ములాయం ఎన్నికై ఆ అసెంబ్లీ కాలమంతా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నాయకుడుగా గుర్తింపు పొందారు.
ముఖ్యమంత్రిగా
బోఫోర్స్ ఉదంతంతో 1989లో ప్రధాని రాజీవ్ ను ఓడించడానికి నాలుగు పార్టీల కలయికతో ఏర్పడిన జనతాదళ్‌లో ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ దళ్ కూడా విలీనం అయ్యింది. లోక్ సభ, అసెంబ్లీకి 1989లో ఏక కాలంలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ కేంద్రంలోను ఇటు యూపీలో విజయం సాధించింది. ములాయం ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడ్డానికి అవసరమైన మెజారిటీ లేదు. కమ్యూనిస్టుల మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు.
జనతాదళ్ ప్రభుత్వం మండల్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆందోళన చేసింది. అనంతర పరిణామాల మధ్య భాజపా తన ఎంపీల మద్దతు ఉపసంహరించుకోవటంతో అటు కేంద్రంలో ఇటు యూపీలో ప్రభుత్వాలు పడిపోయాయి. తర్వాత 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ మద్దతుతో ములాయం రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు.
రక్షణమంత్రిగా
1996లో ములాయం మొదటి సారి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. అది మొదలు గత 2019 వరకూ జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి వరసగా విజయం సాధించడం పెద్ద విశేషం. 1996లో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం కీలక రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2003లో మూడోసారి ములాయం యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.
Also Read: Mulayam Singh Yadav Death: 'ఆయన మరణం నన్ను బాధిస్తోంది'- మోదీ సహా ప్రముఖుల సంతాపం
Also Read: Mulayam Singh Yadav Death: రెజ్లింగ్ నుంచి రాజకీయం వరకు- ములాయం గురించి టాప్ 10 ఫ్యాక్ట్స్!