Mulayam Singh Yadav Death: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ములాయం మరణం తనను బాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆయనతో తన ప్రయాణాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు.
బాధిస్తోంది
నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ములాయం సింగ్ యాదవ్ జీ.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా పని చేశారు. ఆ సమయంలో ములాయం సింగ్‌తో తరుచూ మాట్లాడేవాడిని. ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. నేను ఎప్పుడూ ఆయన అభిప్రాయాలను వినడానికి ఎదురు చూసేవాడిని. ఆయన మరణం నన్ను బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, లక్షలాది మంది మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి. - ప్రధాని నరేంద్ర మోదీ
ఒక శకం ముగిసింది
ములాయం సింగ్ యాదవ్ జీ తన ప్రత్యేక నైపుణ్యంతో దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తన గళాన్ని వినిపించారు. అట్టడుగు స్థాయి నుంచి ఎన్నో శిఖరాలను అధిరోహించిన నేతగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ప్రగాఢ సానుభూతి
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ జీ మరణం చాలా బాధాకరం. ఆయన మృతి సోషలిజంలో ఓ పోరాట యుగానికి ముగింపు పలికింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
విచారకరం
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ మరణ వార్త చాలా విచారకరం. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని వారందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. - మాయావతి, బహుజన్ సమాజ్ పార్టీ
సంతాప దినాలు
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
Also Read: Mulayam Singh Yadav Death: రెజ్లింగ్ నుంచి రాజకీయం వరకు- ములాయం గురించి టాప్ 10 ఫ్యాక్ట్స్!