ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో కన్నుమూశారు. అక్టోబర్ 1న ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు. ములాయం సింగ్ మరణంతో సమాజ్ వాదీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో కుమారుడు అఖిలేష్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్, కోడలు అపర్ణ యాదవ్ ఢిల్లీకి బయలుదేరారు. మూడు నెలల క్రితం ఆయన భార్య సాధనా గుప్తా కూడా మరణించిన సంగతి తెలసిందే. ములాయం సింగ్ యాదవ్ మృతిపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, నా తండ్రి, జన నేత ఇక లేరని అన్నారు.
1939లో సైఫాయిలో జననం
55 ఏళ్లకు పైగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ 1939 నవంబర్ 22న ఇటావా జిల్లాలోని సైఫాయ్‌లో జన్మించారు. పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశారు. యూపీలోని జస్వంత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 1967లో తొలిసారిగా అసెంబ్లీకి చేరుకున్న ఆయన ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో వెనుదిరిగి చూసుకోలేదు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. ఆయన ఏడుసార్లు ఎన్నికైన తర్వాత లోక్‌సభ ఎంపీ అయ్యారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కూడా అవకాశం వచ్చింది.
గొప్ప రాజకీయ ప్రయాణం
ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితం చాలా విశిష్టమైనదిగా చెప్తారు. 1977లో జనతా పార్టీ నుంచి తొలిసారిగా యూపీకి మంత్రిగా, 1989లో తొలిసారి యూపీ సీఎం అయ్యారు. ఆ తర్వాత 1993, ఆపై 2003లో రెండు, మూడోసారి సీఎం పదవిని చేపట్టారు. 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ 1993లో బీఎస్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ఆయన పార్టీ సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం లోక్‌సభకు మెయిన్‌పురి స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం అన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మంత్రి కేటీఆర్ కూడా అఖిలేష్ యాదవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములాయం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.