హైదరాబాద్ లోని ఉప్పల్ లో కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రిని కన్న కొడుకే కొట్టి చంపాడు. రోకలి బండతో మోది తండ్రి ప్రాణాలు తీశాడు. తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి ఇంట్లో అందర్నీ వేధిస్తున్నాడనే కారణంతో తండ్రిని రోకలి బండతో మోది హత్య చేశాడు. ఉప్పల్‌ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అజ్మత్‌ నగర్‌లో లాకు గణపతి అనే 50 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారులు అభిషేక్‌, విశాంత్‌.  గణపతి డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. చాలా ఏళ్ల క్రితమే గణపతి మద్యానికి బానిస అయ్యాడు. బాగా తాగి ఇంటికి రావడమే కాకుండా మద్యం మత్తులో తరచూ భార్యాపిల్లలతో గొడవ పడుతూ ఉండేవాడు. ఆ వేధింపులు భరించ లేక గణపతి భార్య ఇటీవల విషం తాగింది. 


కుటుంబ సభ్యులు ఎలాగొలా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎలాగొలా ఆమెను బతికించుకున్నా కానీ, గణపతి తాగి ఇంటికి రావడం మానలేదు. ఈ విషయంపై శనివారం రాత్రి గణపతికి, చిన్న కుమారుడు అభిషేక్‌ అనే 22 ఏళ్ల యువకుడికి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో అభిషేక్‌ తన తండ్రి తలపై రోకలి బండతో బాదాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇటీవలే పాతబస్తీలో దారుణ హత్య
వారం రోజుల క్రితమే హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి దారుణమైన హత్య జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక కుమార్ వాడి ప్రాంతంలో రైన్ బజార్‌కి చెందిన రౌడీ సీటర్ సయ్యద్ భక్త్యారాగ అలియాస్ మహ్మద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఎవరో అతడిపై కత్తితో దాడి చేయడంతో అపస్మారక స్థితికిలోకి వెళ్లాడు. రౌడీ షీటర్ మహ్మద్‌ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, డాక్టర్లు అతణ్ని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. గత కొంత కాలంగా విదేశాల్లో ఉన్న మహ్మద్‌ తాగా హైదరాబాద్‌కి వచ్చాడు. మరో రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ లోగా ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది.


ఇది పాత కక్షలకు సంబంధించిన హత్యగా పోలీసులు భావించారు. పోలీసులు కూడా రౌడీ షీటర్లపై చూసీ చూడకుండా వదిలేస్తున్నారని, గట్టి నిఘా ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హత్యకు కారకులెవరు? మృతుడు విదేశాలకు వెళ్లడం వెనక దాగిన కారణాలు ఏమయి ఉంటాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.