Mulayam Singh Yadav Death: ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలు ముద్దుగా 'నేతాజీ' అని పిలుచుకునే ఆ మహా రాజకీయ వృక్షం కూలిపోయింది. 3 సార్లు యూపీ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణమంత్రిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ (82) (Mulayam Singh Yadav) కన్నుమూశారు.


వయసు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ములాయం.. సోమవారం కన్నుమూశారు. దీంతో యూపీ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.


టాప్- 10 ఫ్యాక్ట్స్



  1. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సైఫాయ్‌లో 1939, నవంబర్ 22న జన్మించిన ములాయం సింగ్ యాదవ్‌ రెజ్లర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. ఆయన తండ్రి సుధర్‌.. ములాయంను రెజ్లర్‌ చేయాలని భావించారు.

  2. లోహియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ములాయం సింగ్ యాదవ్ 1992 అక్టోబర్ 4న సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు.

  3. ములాయం సింగ్‌కు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. రతన్ సింగ్ కంటే ములాయం చిన్నవాడు కాగా అభయ్ రామ్, శివపాల్, రామ్ గోపాల్ సింగ్, కమలా దేవి కంటే పెద్దవాడు.

  4. ములాయం మూడు సార్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996-98 వరకు రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు.

  5. ఎక్కువ కాలం పాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగిన అతి తక్కువ మంది నేతల్లో ములాయం ఒకరు. ఆయన తన తుదిశ్వాస వరకు మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. గతంలో అజంగఢ్, సంభాల్ నియోజకవర్గాలకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు.

  6. నేతాజీగా ప్రజలు పిలుచుకునే ములాయం మొదటిసారిగా 1967లో ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభకు సభ్యునిగా ఎన్నికయ్యారు.

  7. ములాయం 1982-1985 మధ్య శాసన మండలి సభ్యుడిగా పని చేశారు. మొత్తం 10 సార్లు ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభకు ఆయన సభ్యుడిగా ఉన్నారు.

  8. ములాయం సింగ్ మాల్తీ దేవిని మొదటి వివాహం చేసుకున్నారు. అఖిలేశ్ యాదవ్.. ములాయం, మాల్తీ దేవిల కుమారుడు. సాధన గుప్తాతో ములాయం రెండో వివాహం జరిగింది. సాధన, ములాయంల కుమారుడు ప్రతీక్ యాదవ్.

  9. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ములాయం సింగ్ యాదవ్ 15 కోట్లకు పైగా ఆస్తులకు యజమాని. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అఫిడవిట్‌లో తన చర, స్థిరాస్తులు రూ.16 కోట్ల 52 లక్షల 44 వేల 300గా ఆయన పేర్కొన్నారు.

  10. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం సింగ్ తన అఫిడవిట్‌లో రూ.11 కోట్ల ఆస్తులను ప్రకటించారు.


Also Read: Mulayam Singh Yadav Death: UP మాజీ సీఎం ములాయం సింగ్ కన్నుమూత, ప్రకటించిన అఖిలేష్ యాదవ్ - సీఎం కేసీఆర్ సంతాపం