సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరు మగ పిల్లలు పుట్టినట్లు నయన్ భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాము అమ్మానాన్నలం అయ్యామని ప్రకటించారు. నయనతారకు అప్పుడే పిల్లలేంటి? కనీసం నయనతార ఫ్రెగ్నెంట్ అనే విషయం కూడా తెలియదు. అయినా, పెళ్లైన నాలుగు నెలలకే పిల్లలు ఎలా పుట్టారు? అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చోప చర్చలు నడుస్తున్నాయి. సరోగసీ ద్వారా ఈ దంపతులు పేరెంట్స్ అయినట్లు నయన్ సన్నిహితులు చెప్తున్నారు. కాసేపు వీరికి పిల్లలు ఎలా పుట్టారు? అనే విషయాన్ని పక్కన పెడదాం..


నయనతార కవల పిల్లలు కంటుందని 2010లోనే చెప్పిన జూ. ఎన్టీఆర్


నయన తార కవల పిల్లలకు తల్లి కావడం పట్ల సోషల్ మీడియాలో ఓ విషయం జోరుగా చర్చకు వస్తుంది. ‘‘నయన్ కవల పిల్లలను కంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడు. అదే ఇప్పుడు వాస్తవం అయ్యింది’’ అంటూ ఓ పోస్ట్ వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 2010లో వి. వి వినాయక్ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ ‘అదుర్స్’ అనే సినిమా చేశారు. ఇందులో నయనతార హీరోయిన్ గా చేసింది. చంద్రకళ పాత్ర పోషించింది. ఎన్టీఆర్ బ్రాహ్మణ గెటప్ చారికి తోడుగా చంద్రకళ యాక్ట్ చేసింది. ఓ సన్నివేశంలో ఎన్టీఆర్.. నయనతారకు కవల పిల్లలు పుడతారని చెప్తారు. చంద్రకళ ఎడమ నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని, శాస్త్రం ప్రకారం ఆమెకు కవలలకు జన్మనిస్తుందని బల్లగుద్ది ప్రకటిస్తాడు. అదే విషయం పదేళ్ల తర్వాత నిజమయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






కవలలతో ఆడుకుంటున్న భట్టు!


మరోవైపు ‘అదుర్స్’ సినిమా క్లైమాక్స్ లో చారి, చంద్రకళకు పుట్టిన కవల పిల్లలను భట్టు క్యారెక్టర్ చేసిన బ్రహ్మానందం ఎత్తుకున్న ఫోటోలు కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన మాటలు నిజ జీవితంలో వాస్తవం అయ్యాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  






తమకు కవల పిల్లలు పుట్టినట్లు ఆదివారం(అక్టోబర్9) నాడు నయనతార భర్త విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్నారులకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. శిశువుల పాదాలను నయనతార, విఘ్నేష్ ముద్దాడుతూ ఉన్నారు. నయన్, నేను అమ్మానాన్నలం అయ్యాం.. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ విఘ్నేష్ సోషల్ మీడియా ద్వారా కోరాడు. అటు పలువురు సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.