IRCTC Update: భారతీయ రైల్వే రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఈరోజు దేశ వ్యాప్తంగా 115 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మెయింటెనెన్స్, మౌలిక వసతుల కారణంగా 115 రైళ్లను పూర్తిగా, మరో 48 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వివరించింది. అయితే ఇది కేవలం ఈ ఒక్క రోజు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ రైళ్లకు సంబంధించి ముందుగానే బుక్ చేస్తుసుకున్న టికెట్లను రద్దు చేస్తామని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసిన వారు అధికారులను సంప్రదించాలని సూచించింది.
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..
దీపావళి పండుగ రద్దీ సందర్భంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైళ్లలో ముందుస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విశాఖపట్నం - బెంగళూరు మధ్య అక్టోబర్ 3 నుంచి 31వ తేదీ వరకు బెంగళూరు- విశాఖపట్నం మధ్య 5 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.5 గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు, ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.0 గంటలకు బెంగళూరు నుంచి విశాఖకు రైలు బయల‌్దేరనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖపట్నం - తిరుపతి మధ్య 5, అక్టోబర్ 4 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు తిరుపతి - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ప్రతి సోమవారం రాత్రి 7.10 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి విశాఖకు రైలు బయలు దేరనున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 11 నుంచి 25 వరకు పూర్ణ - పందార్పూర్ మధ్య 3 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అక్టోబర్ 11, 18, 25వ తేదీల్లో రాత్రి 9 గంటలకు పూర్ణలో ప్రత్యేక రైలు బయలు దేరనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 26 వరకు పందార్పూర్ - పూర్ణ మధ్య 3 ప్రత్యేక రైల్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 12, 19, 26 తేదీల్లో ఉదయం 8.30 గంటలకు పందార్పూర్ నుంచి రైల్లు బయలుదేరుతాయని వెల్లడించింది. అలాగే యశ్వంత్ పూర్ - సికింద్రబాబ్ (07152) రైలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్య స్థానానికి చేరుతుంది. రెండు రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెహలంక స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
అలాగే సోమవారం పూర్ణా - తిరుపతి మధ్య సింగిల్ వే స్పెషల్ రైల్ (07633) ను నడపనున్నట్లు చెప్పింది. ఈ రైలు రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10 గంటలకు గమ్య స్థానానికి చేరునున్నది. ఈనెల 12వ తేదీన నర్సాపూర్ - తిరుపతి, విజయవాడ - ధర్మవరం మధ్య సింగిల్ వే స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నర్సాపూర్ - తిరుపతి (07130) రాత్రి 8.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గంటలకు గమ్య స్థానానికి చేరుకుంటుందని పేర్కొంది. విజయవాడ - ధర్మవరం (07131) రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు గమ్య స్థానానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.