Viral Video: ఓ విద్యార్ధిపై టీచర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నేలపై పడేసి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని ఓ స్కూల్‌లో బాధిత విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థిపై ఉపాధ్యాయుడు సందీప్ భారతి దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. గొంతు నొక్కి పిడిగుద్దులు కురిపించాడు. విద్యార్థిని నేలపై పడేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక విద్యార్థి విలవిల్లాడిపోయాడు. ఒకానొక సమయంలో ఎదురుతిరిగే ప్రయత్నం చేశాడు.
దీంతో టీచర్ మరింత రెచ్చిపోయాడు. విద్యార్థి లేచి ముందుకు వెళ్తున్న క్రమంలో టీచర్ మరోసారి అతడిని చితకబాదాడు. మెడపట్టుకుని ముందకు నెట్టివేశాడు. ఇదంతా చూస్తున్న మిగతా టీచర్లు, విద్యార్థులు మాత్రం టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఎఫ్ఐఆర్
ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులతో సంప్రదించిన తర్వాత టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రేవా ఎస్‌పీ నవనీత్ భాసిన్ తెలిపారు.
అయితే విద్యార్థిని టీచర్ అంతలా ఎందుకు కొట్టాడనే విషయం తెలియలేదు. నెటిజన్లు మాత్రం ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ట్వీట్లు చేస్తున్నారు.