Congress President Election: 


మల్లికార్జున్ ఖార్గే నామినేషన్..


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకూ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ పేరు దాదాపు ఖరారైపోయింది. ఉన్నట్టుండి ఆయన అధిష్ఠానానికి ఎదురు తిరగటం వల్ల రేసులో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తరవాత దిగ్విజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని అంతా అనుకున్నారు. శశి థరూర్ పోటీలో ఉన్నప్పటికీ...దిగ్విజయ్‌ సింగ్‌కే అధ్యక్ష పదవి దక్కుతుందని ఫిక్స్ అయ్యారు. కానీ...ఇప్పుడు ఉన్నట్టుండి మరో పేరు తెరపైకి వచ్చింది. మల్లికార్జున్ ఖార్గే కూడా ఈ ప్రెసిడెంట్‌ పోటీలోకి వచ్చారు. శశిథరూర్, దిగ్విజయ్ సింగ్‌తో పాటు మల్లికార్జున్ ఖార్గే కూడా నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖార్గే...ఎప్పటి నుంచో కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్నారు. ఇప్పటి వరకూ శశి థరూర్ వర్సెస్ దిగ్విజయ్ మధ్య ద్విముఖ పోరు అనుకున్నా...ఇప్పుడది ఖార్గే రాకతో త్రిముఖ పోరుగా మారిపోయింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు వీళ్లు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాత్రికి రాత్రి ఖార్గేతో మాట్లాడారు. నామినేషన్ వేయాలని అధిష్ఠానం అడుగుతోందని ఆయనకు వివరించారు. అదిష్ఠానం మాటను శిరసావహించిన ఖార్గే...రేసులోకి దిగారు. అయితే...ఎవరు ఈ పోటీలో ఉన్నా...తాము మాత్రం న్యూట్రల్‌గానే ఉంటామని మొదటి నుంచి సోనియా చెబుతూనే ఉన్నారు. ఒకవేళ ఖార్గే అధ్యక్షుడిగా ఎన్నికైతే...రాజ్యసభలో ప్రతిపక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒకే పదవి అనే నిబంధనను చాలా కచ్చితంగా అమలు చేస్తోంది కాంగ్రెస్. 


రేసులో నుంచి తప్పుకున్న గహ్లోట్..


ఇదే రూల్‌ని అశోక్ గహ్లోట్‌కు వివరించింది అధిష్ఠానం. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. అయితే...తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా తన వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని గహ్లోట్ మొండి పట్టు పట్టారు. ఈ విషయంలో సోనియా గాంధీ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఫలితంగా...గహ్లోట్ ఢిల్లీకి వచ్చి సోనియాకు క్షమాపణలు చెప్పారు. అంతే కాదు...అధ్యక్ష ఎన్నిక రేసులో నుంచి తప్పుకుం టున్నట్టూ ప్రకటించారు. ఆ తరవాతే...మల్లికార్జున్ ఖార్గే పేరు తెరపైకి వచ్చింది. అంటే..గహ్లోట్ స్థానంలో ఖార్గే వచ్చారన్నమాట. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు సీనియర్ నేతలు.. దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ సమావేశమయ్యారు. నామపత్రాలు స్వీకరించిన అనంతరం దిగ్విజయ్ సింగ్.. శశిథరూర్​ను కలిశారు. అధ్యక్ష పదవికి దిగ్విజయ్ పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు థరూర్ తెలిపారు. ఇది ఇద్దరి మధ్య పోరాటంగా కాకుండా.. స్నేహపూర్వక పోటీగానే ఉండాలని ఇరువురూ అంగీకరించుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లేనని థరూర్ ట్వీట్ చేశారు.


ముఖ్యమైన తేదీలు


నామినేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 30
నామినేషన్ పత్రాల పరిశీలన: అక్టోబర్‌ 1
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8
ఓటింగ్‌:  అక్టోబర్‌ 17
ఫలితాలు: అక్టోబర్ 19


Also Read: KCR National Party : బీఆర్ఎస్‌ పెడితే టీఆర్ఎస్ పరిస్థితేంటి ? విలీనమవుతుందా ? ప్రత్యేక పార్టీగానే ఉంచుతారా?