Skandamata Durga: స్కందమాత.. ఈ అవతారంలో బాలకుమారస్వామి (స్కందుడు) ఒడిలో ధరించిన రూపులో అమ్మవారు కనిపిస్తారు. శివగణాలకు స్కందుకు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే ఇరువురి ఆశీస్సులూ లభిస్తాయని అంటారు.
 
 ‘స్కందయతీతి శత్రూన్‌ శోషయతీతి స్కందః’ 
శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని కూడా పిలుస్తారు.స్కందుని తల్లికావడంతో అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.


సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥
స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. కుమారస్వామిని ఎత్తుకుని ఉండటం వల్ల ఈ తల్లిని పూజిస్తే స్కందుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. స్కందమాతను అగ్నికి అధిష్ఠాన దేవతగా, ప్రాకృతిక శక్తిగా, కాలస్వరూపిణిగా, విశ్వజననిగా ఆరాధిస్తారు.


Also Read:  ఐదవ రోజు లతితా త్రిపురసుందరీ దేవి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు


సతీదేవి దక్షప్రజాపతి కూతురు. పరమేశ్వరుడి ఇల్లాలు. తండ్రి తలపెట్టిన యాగానికి పిలుపు లేకున్నా...భర్త వద్దని చెప్పినా వెళుతుంది. అక్కడ అవమానాన్ని ఎదుర్కోవడంతో సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది. సతీ వియోగంతో రగిలిపోయిన శివుడు.. వీరభద్రుడిని సృష్టిస్తాడు. ఆయన దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. పరమేశ్వరుడు సతీ విరహంలో కూరుకుపోతాడు. ఇక శివుడు పెళ్లిచేసుకోడని తెలుసుకున్న తారకాసురుడు...ఘోర తపస్సు చేసి శివుడికి పుట్టిన కొడుకు (శివుడికి సంతానం కలగదనే ఉద్దేశంతో..) వల్ల తప్ప తనకు మరణం లేకుండునట్లుగా వరం పొందుతాడు. వర గర్వంతో సజ్జనులను పీడిస్తూ ఉంటాడు. అప్పుడు సతీదేవి హిమవంతుడికి కూతురుగా జన్మించి..ఘోర తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుంటుంది. 


Also Read: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా


వివాహానంతరం శివపార్వతులు కైలాసంలో కేళీ వినోదాలతో కాలం గడుపుతుంటారు. మరోవైపు తారకాసురుడి ఆగడాలు మితిమీరడంతో దేవతలంతా తమను రక్షించమని కైలాసానికి వెళ్లి వేడుకుంటారు. ఆ సమయంలో దేవతల తొందరపాటుతో శివతేజస్సు పార్వతిలో కాకుండా కిందికి జారిపోతుంది. ఆ తేజస్సుని కొంతకాలం అగ్ని భరిస్తాడు...ఆ శక్తిని తట్టుకోలేక దాన్ని గంగలో వదిలేస్తాడు. గంగ కూడా భరించలేక దాన్ని భూమిపై రెల్లు పొదల్లోకి తోసేస్తుంది. ఆ తేజస్సు నుంచి ఓ బాలుడు జన్మిస్తాడు. ఆరుగురు కృత్తికలు ఆ పసివాడిని పెంచుతారు. తల్లులందరి దగ్గరా పాలు తాగడానికి వీలుగా ఆరు ముఖాలతో ఆవిర్భవించి షణ్ముఖుడు అయ్యాడు. కృత్తికలు పెంచారు కనుక కార్తికేయుడు. శివతేజస్సు జారడం వల్ల పుట్టినవాడు కావడంతో స్కందుడు. ఇలా రకరకాల పేర్లతో పిలిచారు. శక్తిమంతుడు, ప్రజ్ఞావంతుడైన స్కందుడిని తమ సేనానిగా చేసుకుంటారు దేవతలు. మహాసేనతో తారకాసురుణ్ని సంహరించి లోక కల్యాణం చేశాడు కుమారస్వామి. కుమారుడికి శక్తి ఆయుధాన్ని అనుగ్రహించిన స్కందమాత.. తనను కొలిచే భక్తులకు శక్తియుక్తులను ప్రసాదిస్తుంది. స్కందమాత ఆరాధన విశేష ఫలాలనిస్తుంది.