KCR National Party :  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. దసరా రోజున లాంఛనంగా ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతున్నారు. జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి లేదా..  భారతీయ రైతు సమితి .. ఏదైనా కావొచ్చు.. మొత్తంగా బీఆర్ఎస్. అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న సందేహం. కేసీఆర్ బీఆర్ఎస్‌ను ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి ? తెలంగాణలో ఆ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తారా ? లేకపోతే బీఆర్ఎస్ శాఖగా టీఆర్ఎస్ కొనసాగుతుందా ? కేసీఆర్ ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారు?


టీఆర్ఎస్ అంటే ఓ చరిత్ర!


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రస్తావన రాకుండా తెలంగాణ రాష్ట్రం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో అడుగంటిపోయిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిల్చి.. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్, టీఆర్ఎస్‌ను నడిపించిన  వారు కేసీఆర్. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి లేని తెలంగాణను ఊహించలేము. కానీ ముందు ముందు ఈ పార్టీ ఉంటుందా అనే సందేహం ప్రారంభమైంది. ఇతర పార్టీలు రాజకీయ వ్యూహాలతో టీఆర్ఎస్‌ను నిర్వీర్యం చేయడం కాకుండా స్వయంగా కేసీఆరే టీఆర్ఎస్‌ను అంతర్థానం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం. 


జాతీయ పార్టీ పెడితే తెలంగాణలో ఏ వ్యూహం అమలు చేస్తారు ?


కేసీఆర్ జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఉన్న పార్టీనే మళ్లీ ఆయన లాంచ్ చేయలేరు.పైగా తెలంగాణ కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి. జాతీయ పార్టీగా ఆ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేదు. అందుకే బీఆర్ఎస్ పేరు తెరపైకి వచ్చింది. కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దసరా రోజున ప్రకటన చేయడం ఖాయమనుకోవచ్చు. మరి అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ  ప్రకటన తర్వాత అనేక సమస్యలు తెరపైకి వస్తాయి.


రెండు పార్టీలకు అధ్యక్షుడిగా ఉండలేరు!


ఓ ప్రాంతీయ పార్టీ.. మరో జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండలేరు. నిబంధనలు అందుకు అంగీకరించవు. అసలు అలాంటి ఆలోచన కూడా ఎవరికీ రాదు. జాతీయ  పార్టీ ప్రకటించిన వెంటనే కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీని ప్రకటిస్తే అది నిబంధనల ప్రకారం చెల్లుబాటు కాకపోవచ్చు. అందుకే కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవిని వదులుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. 


బీఆర్ఎస్‌లో టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారా?


కేసీఆర్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే.. ఆ పార్టీలో టీఆర్ఎస్‌ను విలీనం చేయాలి. అప్పుడు టీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది. ఇలా చేయడం పార్టీకి మంచిది కాదని.. మనదైన గుర్తింపు పోతుందని టీఆర్ఎస్ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. విలీనం చేసినా అనేక సమస్యలు వస్తాయి. పార్టీ గుర్తు దగ్గర్నుంచి ప్రతీ అంశాన్ని మళ్లీ కొత్తగా చెక్కుకుంటూ రావాలి.  అంతకు మించి తెలంగాణ ప్రజల్లో మన పార్టీ అనే భావనపోతుంది. అదే జరిగితే మూలాలను పెకిలించుకున్నట్లే అవుతుంది.  


ప్రత్యేక పార్టీగా ఉంచి కేటీఆర్‌కు అప్పగిస్తే !?


టీఆర్ఎస్‌ను ప్రత్యేక పార్టీగానే ఉంచి.. బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా చేస్తే చాలన్న వాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్ అధ్యక్ష పదవుల నుంచి వైదొలిగి.. కేటీఆర్‌కుపూర్తి స్థాయి చార్జ్ అప్పగిస్తే సరిపోతుందని.. బీఆర్ఎస్ .. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేస్తుందని.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ రూపంలో బరిలో ఉండేలా ప్లాన్ చేయవచ్చని చెబుతున్నారు. ఇలా అయినా తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. టీఆర్ఎస్, బీఆర్ఎస్ వేర్వేరుగానే గుర్తింపు పొందుతాయి. ఎంపీలు కూటమిగానే ఉండాల్సి వస్తుందికానీ ఒకే పార్టీగా కాదు. 


మొత్తంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అడుగులు చాలా క్లిష్టమైనవి. ఇతర రాష్ట్రాల్లో ప్రజల మనసులు గెల్చుకోవడం సంగతి ర్వాతా ముందు పార్టీ పరంగా పరిష్కరించుకోవాల్సిన సవాళ్లు చాలా ఉంటాయి.