YSRCP Ali : సినీ నటుడు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికలకు ముందు చేరారు. అయితే రెండు రోజుల కిందట హఠాత్తుగా తాను వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేయబోవడం లేదని ప్రకటించారు. అంతే కాదు సీఎం జగన్ ను పొగిడారు. ఆయనను సీఎం చేయాలనే కాంక్షతోనే వైఎస్ఆర్‌సీపీలో చేరానని వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఆయనను సీఎంను చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటనే వైఎస్ఆర్‌సీపీ నేతలను కూడా ఆశ్చర్య పరిచింది. ఆయన జనసేనలో చేరుతారని ఎక్కడా ప్రచారం జరగడం లేదు. కనీసం ఇటీవలి కాలంలో ఆయన పవన్ కల్యాణ్‌ను కలిసినట్లుగా కూడా లేదు. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్‌పై అలీ వ్యక్తిగత విమర్శలు కూడా చేయడంతో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత సినీ ఫంక్షన్లలో ఒకటి , రెండు సార్లు కలిశారు తప్ప..గతంలోలా వ్యక్తిగత స్నేహం లేదని చాలా సార్లు తేలిపోయింది.
జనసేనలో చేరుతున్నారని ఎవరు చెప్పారు ?
కానీ హఠాత్తుగా తాను వైఎస్ఆర్‌సీపీని వీడి జనసేనలో చేరడం లేదని ఆయన ప్రకటించుకున్నారు. ఈ ప్రకటన వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని సొంత పార్టీలోని నేతలు అంచనా వేస్తున్నారు. అలీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో 2018లో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్‌సీపీ మధ్య చక్కర్లు కొట్టారు. చివరికి ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. అయితే అసెంబ్లీ టిక్కెట్ లభించలేదు. అలాగని ఏ నామినేటెడ్ పోస్టు కూడా లభించలేదు. ఇటీవల ఆయనకు రాజ్యసభ సీటు ఖాయమన్న ప్రచారం జరిగింది. సీఎం జగన్ ఆహ్వానంతో సతీమణి సమేతంగా జగన్‌ను కలిశారు. వారం రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతామన్నారని అప్పుడే మీడియాకు చెప్పారు. కానీ ఆ వారం రోజులు ఇంత వరకూ రాలేదు.
పదవి కోసం పార్టీపై ఒత్తిడి తెచ్చే వ్యూహమా ?
ఇటీవల టాలీవుడ్ నుంచి అందరూ వైఎస్ఆర్‌సీకి దూరమయ్యారన్న ప్రచారం ఊపందుకోవడంతో అలీకి.. పోసాని కృష్ణమురళికి రెండు నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు లీక్ చేశాయి. అయితే అది కూడా ప్రచారంలాగానే మిగిలిపోయింది. వారికి ఎలాంటి పదవులు ప్రకటించలేదు. దీంతో పార్టీపై ఒత్తిడి తేవడానికే అలీ ఇలా పార్టీ మార్పు ప్రకటనపై ఉద్దేశపూర్వకంగా ప్రకటన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఏడాదిన్నర కూడా లేదు. గత ఎన్నికలకు ముందు పార్టీకి సేవ చేసినందుకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు రాక పోతే ఇక ముందు ఏ పదవీ రాదన్న ఉద్దేశంతో ఆయనీ ప్రకటన చేసి ఉంటారని చెబుతున్నారు.
అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నం
మరో వైపు అలీకి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యం ఉందని.. చెబుతున్నారు. గుంటూరు ఈస్ట్ లేదా రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని ఆయన కోరుకుంటున్నారు. రెండు చోట్ల జనసేన పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో టిక్కెట్ కోసమూ ఒత్తిడి చేసినట్లుగా ఉంటుందని చెబుతున్నారు . ఒక వేళ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనలో చేరి అసెంబ్లీకి వెళ్లాలన్న కోరికను తీర్చుకునే ప్రయత్నం అలీ చేసే అవకాశం ఉందంటున్నారు.