ఏనీ సెగ్మెంట్‌ కాదు ఇప్పుడు అందరి చూపు ఒక్క నియోజకవర్గం వైపే ఉంది. అది కూడా కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గమే. ఎందుకు ఇప్పుడు గుడివాడ అందరికి కేరాఫ్‌ గా మారింది. ముఖ్యంగా పొలిటికల్‌ పార్టీలు, లీడర్లు గుడివాడని ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అన్నదే ఇప్పుడు రాజకీయసెంటర్‌ లో హాట్‌ టాపిక్‌.


175లో గుడివాడ కూడా ఉందా? 
ఏపీలోని రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు మాత్రం గుడివాడ నియోజకవర్గమే అన్ని పార్టీలు, నేతలకు టార్గెట్‌గా మారింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో చాలా నియోజకవర్గాలు ఉన్నా ఒక్క గుడివాడపైనే ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు అంటే వైసీపీ నేతే కారణమంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా కంచుకోట లాంటిది. అయితే గత ఎన్నికల్లో ఈ జిల్లాపై పట్టుకోల్పోయింది. వైసీపీ మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్‌ లను గెలుచుకుంది. 


ఇంతకుముందు గుడివాడ నుంచి టిడిపి అభ్యర్థిగా నిలబడి గెలిచిన కొడాలినాని ఇప్పుడు వైసీపీ లీడర్‌ గా విజయాన్ని అందుకున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. అలా టిడిపి నుంచి వైసీపీ గుడివాడలో జెండా పాతింది. వైసీపీ పార్టీలోకి చేరినప్పటి నుంచి కొడాలి నాని టిడిపి నేతలపై ముఖ్యంగా చంద్రబాబు-లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో ఆయన మాటలు హద్దులు కూడా దాటాయన్న ఆరోపణలు వచ్చాయి. అసలు బాబు-లోకేష్‌ల పేర్లు చెబితే చాలు కొడాలిలో ఓ రకమైన ఆవేశం కట్టలు తెంచుకొని ఆటోమేటిక్‌గా నోరుచేసుకుంటారు. అందుకే ప్రత్యర్థులు కొడాలిని బూతు మంత్రి అని గతంలో ఎద్దేవా చేసేవారు. 


టార్గెట్ గుడివాడ. 


వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుంది. 175కి 175 గెలవాలని సిఎం టార్గెట్ పెట్టుకొని మరీ పని చేస్తున్నారు. అందుకు తాజాగా ఎమ్మెల్యేలకు దశ, దిశ నిర్దేశం కూడా చేశారు.  మరోవైపు టిడిపి ఈ వ్యూహాన్ని దెబ్బతీయాలనుకుంటోంది. తిరిగి ఎలాగైనా సరే అధికారాన్ని అందుకోవాలనుకుంటోంది. అంతేకాదు కంచుకోటైన కృష్ణాజిల్లాలో తిరిగి పచ్చ జెండాని ఎగరేయడమే కాదు గుడివాడని మళ్లీ టిడిపి వశం చేసుకోవాలనుకుంటోంది. అందుకే ఈ నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారట. ఇంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా వంగవీటి రాధని రంగంలోకి దింపాలనుకున్నారు. కొడాలిపై పోటీకి రాధని దింపాలని భావించారట. కానీ ఇప్పుడు బాబు ఆలోచన మారిందంటున్నారు. రాధ-కొడాలి మధ్యన ఉన్న స్నేహాం గురించి తెలుసు కాబట్టే నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు కొడాలిపై పోటికి దమ్మున్న నాయకుడిని దింపాలని నిర్ణయించారట. 


బాబు దృష్టి లో దేవినేని ఉమా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ టిడిపి అభ్యర్థిగా దేవినేని ఉమాని వైసీపీ నేత కొడాలిపై పోటీకి దింపితే విజయం మనదేనన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయంట. కొడాలిపై పోటీ చేసేందుకు నేను రెడీ అని కొద్దినెలల క్రితమే టిడిపి మహాసభల్లో దేవినేని ప్రకటించారు కూడా. 


జనసేన కూడా కొడాలిపై పోటీకి బలమైన నాయకుడిని దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీ లమధ్య పొత్తులు ఉంటే ఎవరిని ఉమ్మడి అభ్యర్థిగా దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ మద్య మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కూడా అవసరమైతే తాను గుడివాడ బరిలో దిగి నాని ఓడిస్తానని చెప్పడంకూడా చర్చనీయాంశం అయ్యింది. అయితే గుడివాడలో కొడాలి నానిని ఎలాగైనా సరే ఓడించాలన్న టీడీపీ, జనసేన ప్లాన్‌లు ఫలిస్తాయా.. లేదా అన్నది తెలియాలంటే 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే !