Lok Sabha Election 2024: 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి మొత్తం ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం దిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నితీశ్, లాలూ సమావేశం కానున్నారు. ఈ మూడు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఐదేళ్లకు పైగా అయింది.
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవి లాల్ జయంతి సందర్భంగా ఫతేహాబాద్‌లో జరిగే ర్యాలీకి నితీశ్, లాలూ హాజరు కానున్నారు. ఐఎన్‌ఎల్‌డీ నేత ఓపీ చౌతాలా ఈ సభను నిర్వహించనున్నారు. దిల్లీకి రాగానే తాను, నితీశ్ కుమార్‌తో కలిసి సోనియాను కలుస్తామని లాలూ అంతకుముందు శనివారం ప్రకటించారు.
అంతకుముందు సోనియా, రాహుల్ గాంధీని త్వరలోనే కలుస్తానని లాలూ యాదవ్ తెలిపారు.
ఇటీవల భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.
ఇటీవల నితీశ్.. దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
" మేము (ప్రతిపక్షం) వచ్చేసారి (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వెనుకబడిన రాష్ట్రాలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు? మేము బీహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇతర వెనుకబడిన రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా సాధించాలి. "