Renigunta Fire Accident: తిరుపతి : చిత్తూరు జిల్లా రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రేణిగుంట టౌన్ లోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ హాస్పిటల్ లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో మంటలను గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబం వారు కావడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.హాస్పిటల్ భవనంలో అగ్ని ప్రమాదం.. చిన్నారులు మృతినూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ బిల్డింగ్ పై పోర్షన్ లో నివాసం ఉంటున్న డాక్టర్ రవిశంకర్ కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్న కార్తిక (6), సిద్ధార్థ రెడ్డి (11), రామసుబ్బమ్మ, డాక్టర్ అనంతలక్ష్మిలను బయటకు తీసుకొచ్చారు. వీరిని చికిత్స కోసం డీబీఆర్ ఆసుపత్రికి పోలీసులు, సిబ్బంది తరలించారు. కానీ ఇద్దరు చిన్నారులు అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఊపిరి ఆడకపోవడంతో చిన్నారులు చనిపోయారని తెలుస్తోంది.
రేణిగుంట అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి వివరాల వీడియో
రుయా ఆసుపత్రికి మృతదేహాల తరలింపు డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఆయన పిల్లలు కార్తిక (6), సిద్ధార్థ రెడ్డి (11)ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రి (Ruia Government General Hospital)కి తరలించారు పోలీసులు. రవిశంకర్ స్వస్థలం జమ్మలమడుగు. బతుకుదెరువు కోసం రేణిగుంటకు వచ్చి సెటిల్ అవుతున్న క్రమంలో కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని స్థానికులు అంటున్నారు. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో వారంతా నిద్రలోనే ఉన్నారని, అందువల్లే ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టం అధికంగా ఉందని తెలుస్తోంది. డాక్టర్ రవిశంకర్ రెడ్డి భార్య అనంతలక్ష్మి, తల్లి రామసుబ్బమ్మకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది... ఇంట్లో ఉన్న ఐదు మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరిని మాత్రమే ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు.