Jinping House Arrest: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎలాంటి శక్తిమంతమైన నేతగా పేరుపొందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుసైగలతో డ్రాగన్ దేశాన్ని నడిపించిన కమ్యూనిస్ట్ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. అలాంటి జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియా సహా ప్రధాన మీడియా ఛానళ్లలో వార్తలు రావడం సంచలనంగా మారింది. ఇందులో నిజమెంత?
ఇలా వార్తలు
జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు దేశం మొత్తాన్ని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) తన చేతుల్లోకి తీసుకున్నట్లు వార్తల్లో పేర్కొన్నారు. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడంతో వెంటనే ఈ న్యూస్ వైరల్ అయింది.
అధికారిక ప్రకటన!
వార్తల సంగతి పక్కనపెడితే కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు.
అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, ఆ దేశ అధికారిక మీడియా గానీ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇది నిజమేనా? లేక రూమారా? అనే విషయంపై అయోమయం నెలకొంది.
చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్‍జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది.
ఇదే కారణమా?
చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల అవినీతి వ్యతిరేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులకు ఉరి శిక్ష విధించింది. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ ఆరుగురు జిన్‌పింగ్ రాజకీయ ప్రత్యర్థి వర్గానికి చెందినవారే. దీంతో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలు ఆయనపై ఆగ్రహంతో పదవి నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది.
భాజపా నేత ట్వీట్
ఈ విషయాన్ని భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ట్వీట్ చేశారు.
అయితే జిన్‌పింగ్ ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన్నారు.
Also Read: Shinzo Abey Last Farewell Meet: షింజో అబె సంస్మరణ సభ.. 1.66 బిలియన్ యెన్ ల ఖర్చు!