జపాన్ లో ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబె అంతిమ వీడ్కోలు నిర్వహణకు అయ్యే ఖర్చు చర్చగా మారింది. ఈ వీడ్కోలు కార్యక్రమం కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 1.66 బిలియన్ల యెన్ లు ఖర్చు పెడుతున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


జపాన్ మాజీ ప్రధాని షింజో అబె జులైలో హత్యకు గురయ్యారు. నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో అబె వేదికపైన కుప్పకూలారు. చికిత్స పొందుతూ మరణించారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. అయితే అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 27న అధికారిక వీడ్కోలు జరపాలని భావిస్తోంది. దీని కోసమే భారీ ఖర్చు అవుతున్నట్లు వార్తలు గుసగుసమంటున్నాయి. 


ఎలిజబెత్-2 కు అయిన ఖర్చు కంటే ఎక్కువ


జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె సంస్మరణ సభ నిర్వహించే కాంట్రాక్ట్‌ను టోక్యోకు చెందిన ఈవెంట్‌ ఆర్గనైజర్‌ మురయామాకు అప్పగించారు. ఈ సంస్మరణ సభకు ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్‌లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా పేర్కొంటోంది. ఇది ఈమధ్యే ముగిసిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియలకు అయిన ఖర్చు కంటే అధికం. ఆమె అంత్యక్రియలకు దాదాపు 1.3 బిలియన్ల యెన్‌లు ఖర్చుచేసినట్లు సమాచారం.


వ్యక్తి ఆత్మహత్యాయత్నం


అయితే ప్రభుత్వం ఎందుకు అంత ఖర్చు చేస్తోందంటూ ఈ కార్యక్రమాన్ని చాలా మంది జపనీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభపై నిరసన తెలుపుతూ ప్రధాని ఫుమియో కిషిడా కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్నాడు. 'ది గార్డియన్‌' నివేదిక ప్రకారం.. సంస్కరణ సభ అంచనా వ్యయం 250 మిలియన్‌ యెన్‌లుగా జపాన్‌ ప్రభుత్వం మొదట పేర్కొంది. ఇదిలా ఉంటే, ముఖ్య క్యాబినెట్‌ సెక్రటరీ హిరోకాజు మాట్సునో ప్రకారం.. ఈవెంట్‌ పోలీసింగ్‌ కోసం దాదాపు 800 మిలియన్‌ యెన్‌లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు 600 మిలియన్‌ యెన్‌లు ఖర్చుకానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఖర్చు 1.7 బిలియన్‌ యెన్‌లకు చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు.


జపాన్‌ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా షింజో అబె రికార్డులకెక్కారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ నిర్వహిస్తోన్న రెండో అధికారిక వీడ్కోలు కార్యక్రమమిది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.