Lakhimpur Violence Case: లఖింపుర్ ఖేరీ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అల్‌హాబాద్ హైకోర్టు నిరాకరించింది. ఆశిష్ మిశ్రా రాజకీయంగా పలుకుబడి కలిగినందున సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అల్‌హాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్ అభిప్రాయపడింది. విచారణపై ఆ ప్రభావం పడవచ్చని జస్టిస్ కృష్ణ పహల్ బెంచ్ పేర్కొంది.
ఆశిష్ బెయిల్ పిటిషన్‌పై జులై 15న వాదనలు ముగిసిన అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. దీనికి ముందు ఫిబ్రవరి 10న ఆశిష్‌కు లఖ్‌నవూ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు దానిని రద్దు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరిగి విచారణ జరిపింది.
ఇదీ జరిగింది
యూపీలోని లఖింపుర్ ఖేరిలో 2021 అక్టోబర్ 3న నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.
Also Read: Rahul Gandhi Tweet: 'మోదీని ఓడించాలంటే అదే మార్గం'- అరెస్ట్ తర్వాత రాహుల్ ట్వీట్