Vizag Woman Missing: విశాఖపట్నంలో భర్త పక్కనుండగానే భార్య కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. నగరంలోని ఆర్కే బీచ్ లో సోమవారం సాయంత్రం పొద్దు పోయాక ఈ ఘటన జరిగింది. పెళ్లి రోజని భర్తతోపాటు సరదాగా బీచ్ కు వచ్చిన వివాహిత ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. భర్త ఫోన్ చూసుకుంటుండడగా, భార్య కనిపించలేదు. ఆమె ఆర్కే బీచ్‌లో గల్లంతైందా లేక.. ఎక్కడికైనా వెళ్లిపోయిందా అనే విషయాలు తెలియరావడం లేదు. 


విశాఖ త్రీటౌన్‌ పోలీసులు వెల్లడించిన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్‌.సాయిప్రియ భర్త శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాత్రి ఆర్కేబీచ్‌కు విహారానికి వచ్చింది. బీచ్ లో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నారు. ఈలోపు, కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ తీరానికి వెళ్లినట్లు భర్త శ్రీనివాస్‌ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో తాను ఫోన్ చూసుకుంటూ సరిగ్గా వెనుకవైపు గమనించలేదని, కొంతసేపటికి తిరిగి చూస్తే తాను కనిపించలేదని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆమె బీచ్‌లో గల్లంతయి ఉంటుందని భావిస్తున్నారు. 


ఆమె సముద్రంలో గల్లంతై ఉంటుందన్న అనుమానంతో విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. నేటి మధ్యాహ్నం వరకూ కూడా గాలింపు కొనసాగుతూనే ఉంది.


భార్య కనిపించకపోవడంతో కంగారుపడ్డ తాను పరిసర ప్రాంతాలు మొత్తం వెతికానని తెలిపాడు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. తామిద్దరికి రెండేళ్ల క్రితం వివాహమైందని, మ్యారేజ్ డే కావడంతో విశాఖ వెళ్లి, ఉదయం సింహాచలం గుడికి వెళ్లామని చెప్పారు. అక్కడ భోజనం చేసి సాయంత్రం బీచ్‌కి వెళ్లారు.