AP TET: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పరీక్ష నిర్వహణను ప్రభుత్వం గందరగోళంగా మార్చింది. పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయడంలో పాఠశాల విద్యాశాఖ పూర్తి నిర్లక్ష్యం వహించింది. వారు చేసని తప్పులే అభ్యుర్థుల పాలిట శాపంగా మారింది. పరీక్షలు ఎలా రాయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థుల సంఖ్యకు సరిపడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోవడంతో.. ఒకే రోజు రెండు పరీక్షలు రాసే వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఉదయం ఓ జిల్లాలో పరీక్ష రాసి మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్ష రాసేందుకు వెళ్లాలని బాధపడుతున్నారు. అందులోనూ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలకు ఎలా చేరుకోగలమని ప్రశ్నిస్తున్నారు. 


మొత్తం 5.5 లక్షల దరఖాస్తులు...


ఈసారి టెట్‌ పరీక్షకు ఏకంగా 5.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష వ్యాలిడిటీని జీవిత కాలంగా మార్చ డం, ప్రైవేటు ఉపాధ్యాయులకూ టెట్‌ తప్పనిసరి చేయడంతో దరఖాస్తులు భారీగా వచ్చాయి. అయితే హడావుడిగా టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విద్యాశాఖ పరీక్ష నిర్వహణకు కోసం మాత్రం సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. గతంలో టెట్‌ పరీక్షకు రెం డు మూడు జిల్లాల్లోని కేంద్రాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించేవారు. కానీ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాలు, అందులోనూ కొన్నిచోట్ల ఒక ప్రాంతాన్ని మాత్రమే చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థులకు దానినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఉధయం ఓ జిల్లాలో, మద్యాహ్నం ఓ జిల్లాలో..


ఒకేరోజు ఉదయం ఎస్జీటీ, మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయాలనుకునే వారికి వేర్వేలు జిల్లాల్లో కేంద్రాలను కేటాయించారు. అవి కూడా పక్క పక్క జిల్లాలు కాదు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖపట్నంలో ఉదయం ఒక పరీక్షను రాసిన అభ్యర్థి, మధ్యాహ్నం మరో పరీక్ష కోసం విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంట వ్యవధిలో అంత దూరం ఎలా వెళ్లగలరనే కనీస అవగాహన కూడా లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరుగుతుండగా రాయలసీమ జిల్లాల్లో మొదటి తేదీల్లో కేంద్రాలు మెరుపు వేగంతో నిండిపోయాయి. దీంతో  పరీక్ష రాయలనుకున్నవారు బెంగళూరు, హైదరాబాద్‌ల్లోని కేంద్రాలను ఎంచుకోవాల్సి వస్తోంది.


హాల్ టికెట్లు వచ్చినా.. కేంద్రాల ఎంపిక చేసుకోని వారెందరో!


ఏపీపీఎస్సీ, ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే అన్ని పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థలకు తెలియజేస్తూ ఉంటాయి. దరఖాస్తులు చేసుకోవడం మొదలు హాల్ టికెట్ల డౌన్ లోడ్, ఫీజులు చెల్లింపు తేదీలతో సహా సమాచారం ఇస్తాయి. కానీ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు సంబంధించి ఏ విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసే ప్రయత్నం చేయలేదు. టెట్‌ పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. కేవలం వెబ్‌సైట్‌ను చూసిన వారు మాత్రమే ముందుగా తమకు కావాల్సిన కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు. ఈ సమాచారం ఆల్యంగా తెలుసుకున్న వారికి దూరం ప్రాంతాల్లోని కేంద్రాలే మిగిలాయి. 


గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులకు ఇప్పటి వరకూ పరీక్షా కేంద్రాల ఎంపికకు సంబంధించిన విషయం తెలియకపోవడం గమనార్హం. సోమవారం నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేస్కునే అవకాశం కల్పించినా.. వారికి ఇప్పటికీ ఆ విషయాలు తెలియవు. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో పాఠశాల విద్యాశాఖ ఉండడంపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.