Villagers Protest: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల పంచాయతీని మండలంగా ఎర్పాటు చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిన్నటి నుంచి వర్షం పడుతున్నా పట్టించుకోకుండా గొడుగులు చేత పట్టుకొనే రెండో రోజు కూడా ధర్నాను చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల పరిధిలోని సొనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఈ ధర్నాలో పాల్గొన్నారు.
సోనాల గ్రామాన్ని మండలంగా చేయాలి..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నూతన మండలాలను ప్రకటించినప్పుడు సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని, వారు ఇచ్చిన మాట ప్రకారం సోనాల గ్రామాన్ని మండలంగా చేయాలని కోరుతున్నారు. ఒక మండలానికి ఉండ వలసిన అన్ని అర్హతలు ఉన్న గ్రామం సోనాల అని ఈ గ్రామానికి దగ్గరగా ఎన్నో ఆదివాసీ గిరిజన పల్లెలు ఉన్నాయని చెప్పారు. ఈ పల్లె ప్రజలు ప్రస్తుతం బోథ్ మండల కేంద్రానికి వెళ్లాలంటే 20 కిలో మీటర్ల దూరం ఉందని కాబట్టి ఆదివాసీ గిరిజన ప్రజలకు ఎంతో కష్టంగా ఉందని కాబట్టి వెంటనే సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరారు. సోనాల గ్రామాన్ని మండలంగా చేసే వరకు తమ ధర్నాను ఆపబోమని గ్రామస్థులు తెలిపారు. అలాగే స్థానిక బోథ్ ఎమ్మెల్యే బాపురావ్ నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
13 మండలాల ఏర్పాటుకు రాష్ట్రం పచ్చజెండా..
ఇటీవలే రాష్ట్రంలో మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ఆంక్షలు, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో నూతన మండలాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్ కేంద్రంగా కొత్త మండలం, నారాయణపేట జిల్లాలోని గుండుమల్, కొత్తపల్లె, వికారాబాద్ జిల్లాలోని దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, సాలూర, డొంకేశ్వర్ మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా సిరోల్ మండలం, సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలో కొత్తగా డోంగ్లి, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం గ్రామాలను మండలాలుగా ఏర్పాచు చేయబోతున్నారు.
15 రోజుల్లో అభ్యంతరాలు తెలియజేయాలి..
వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశిలీంచిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల గ్రామస్థులు మండలం కోసం ప్రయత్నిస్తున్నారు.