కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు భారీగా కోవిడ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కేరళలో 1,66,397 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 30,007 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కోవిడ్ బాధితుల్లో నిన్న ఒక్క రోజే 162 మంది మరణించారు. దీంతో కలిపి కేరళలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 20,134కి పెరిగింది. పాజిటివిటీ రేటు 18.03 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 20,271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,81,209 యాక్టివ్ కేసులున్నాయి.






నిన్న 31 వేలకు పైగా కేసులు..
కేరళ ప్రజలను కరోనా వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నమోదవుతోన్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న 31,445 కేసులు నమోదు కాగా.. ఈ రోజు కూడా 30 వేలకు పైబడి కేసులు వచ్చాయి. ఇటీవల జరిగిన ఓనమ్‌ పండుగ కారణంగానే ఇంత భారీగా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కేరళలో ఆగస్టు 21వ తేదీన ఓనమ్‌ పండగ జరిగింది. పండుగ కావడంతో ప్రజలంతా ఒక్కచోటకు చేరడంతో కోవిడ్ వ్యాప్తి పెరిగినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 


మాస్కప్ కేరళ.. 
కేరళలో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాస్కప్ కేరళ పేరుతో ట్వీట్ చేసింది. ఆగస్టు 19న 10.72 శాతంగా ఉన్న కోవిడ్ కేసులు.. ఆగస్టు 25వ తేదీ నాటికి 22.91 శాతానికి ఎగబాకాయని కేంద్రం పేర్కొంది. 






Also Read: Covishield Vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ 84 రోజుల గ్యాప్‌పై కేంద్రం పునరాలోచన.. వ్యవధి తగ్గే ఛాన్స్


Also Read: AP Covid Cases: ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు.. 12 మంది మృతి