మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా చేస్తున్నారంటూ ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు తనపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తోసి పుచ్చారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ముఖ్యమంత్రి చెబితేనే వినడం లేదని... అసలు ఏ బలం లేని మాజీ ముఖ్యమంత్రి చెబితే వింటున్నాననడం అవివేకమన్నారు. ఎవరో ఆడించాల్సినట్లుగా ఆడాల్సిన అవసం తనకేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో తాను తన బొమ్మ పెట్టుకునే గెలిచానని.. సీఎం జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోపిదేవి ఓడిపోవడాన్ని గుర్తు చేస్తూ.. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని మీరెందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. జగన్ బొమ్మ మీకు పని చేయలేదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అనేక కీలక అంశాలపై మాట్లాడారు. 


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చాలా రోజులుగా జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచారని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపధ్యంలో రఘురామకృష్ణరాజు తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్‌లతో మీడియా ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చెబితేనే వినని తాను మాజీ ముఖ్యమంత్రి చెబితే ఎలా వింటానని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో సినిమా రంగంపై ప్రభుత్వం తీరుపైనా విమర్శలు చేశారు. టాలీవుడ్ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదన్నారు. 


ఇటీవల టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. టిక్కెట్ రేట్లను భారీగా తగ్గించింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు కొంత మంది హీరోలపై కోపం ఉండవచ్చని.. కానీ ఆ పరిశ్రమపై ఆధారపడి కొన్ని వేల మంది జీవిస్తున్నారని గుర్తు చేశారు.  టిక్కెట్ ధరలను తగ్గిస్తే.. వారి జీవితం, ఉపాధిపై ప్రభావం పడుతందన్నారు. ధియేటర్లు,టిక్కెట్ల కారణంగానే సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదల చేసుకోడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని గుర్తు చేశారు. కొంత మంది హీరోలపై ఉన్న కోపా్ని చూపించడానికి వేల మంది కార్మికుల ఉపాధిపై దెబ్బకొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం 50 రూపాయలకు దొరికే మద్యాన్ని 250 రూపాయలకు అమ్ముతున్నారు.150 రూపాయలు మద్యాన్ని 250 చేస్తే కొనుకుంటున్నారు. కానీ టిక్కెట్ రేట్లను మాత్రం తగ్గించారని విమర్శించారు. 


గంగవర పోర్టులో వాటాల అమ్మకంపైనా రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై మండిపడ్డారు.  ప్రభుత్వం వాటా అమ్మవాల్సిన అవసరం ఏముందని.. గంగవరం పోర్టుపై ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ప్రభుత్వంలో మనకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఒక్కసారి ఆలోచించండి సమయవనం పాటించాలని సూచించారు.