దళిత బంధు పథకం అమలు కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో సర్వే చేపట్టారు. ఇందు కోసం ఇటీవలే సీఎంవోలో పోస్టింగ్ పొంది దళిత బంధు పథకాన్ని పర్యవేక్షించే బాధ్యతలు పొందిన రాహుల్ బొజ్జా అక్కడే మకాం వేశారు. దాదాపుగా 4 వందల మంది అధికారులు సర్వే ప్రారంభించారు. నాలుగు రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు. ఇదంతా లబ్దిదారులను ఎంపిక చేయడానికి. అందరికీ ఇస్తామన్నప్పుడు ఇంత భారీ ఎత్తున సర్వే ఎందుకు అన్న డౌట్ అందరికీ వస్తుంది. వచ్చింది కూడా. దళిత బంధు అందరికీ ఇస్తామని.. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్న సర్వే.. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు కాస్త అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి.
ప్రభుత్వం దళిత బంధు పథకానికి సంబంధించి ఎనిమిది మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో మొదటిది తెలంగాణలో నివాసం ఉండాలి. రెండో నిబంధన ప్రకారం జీవో నెం. 5 ప్రకారం దళిత వర్గానికి చెంది ఉండాలి. మూడో నిబంధన ప్రకారం కుటుంబ మొత్తం వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.50 లక్షలు మించకూడదు. నాలుగో నిబంధన రెండున్నర ఎకరాల మాగాణి భూమి లేదా మెట్టతో కలుపుకొని మొత్తం 5 ఎకరాలకు మించి సాగుభూమి ఉండకూడదు. ఐదో నిబంధన ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదు. అలాగే కేంద్ర ప్రభుత్వరంగ లేదా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఉద్యోగం చేయకూడదు. ఆరో రూల్ కుటుంబంలో ఎవరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యగులుగా ఉండకూడదు. ఏడో నిబంధన ప్రకారం కుటుంబం మొత్తానికి పది గుంటలకు మించి నివాస స్థలం ఉండకూడదు. ఎనిమిదో నిబంధనల ప్రకారం ఫోర్ వీలర్ ఉండకూడదు. క్యాబ్ ఉంటే మాత్రం అర్హులే.
ఇప్పటి వరకు ఎస్సీ సర్టిఫికెట్ ఉంటే రూ. పది లక్షలు వస్తాయని దళిత వర్గాలనుకుంటున్నాయి. కానీ పథకానికి అర్హత పొందాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది. లబ్దిదారులను గుర్తించడానికి గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తారు. వారి ద్వారా దళిత వాడల్లో సర్వే చేయిస్తారు. మండలస్థాయిలో ఆ మండల అధికారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీరు మార్గదర్శకాల్లో పేర్కొన్న అర్హతల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను కలెక్టర్‌కు పంపుతారు. లబ్ధిదారుల ఎంపిక చేసిన తర్వాత వెంటనే నిధులు ఇవ్వరు. వారికి ఆసక్తి ఉన్న వ్యాపారంలో అవసరమైన శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత కూడా వ్యాపారం ప్రారంభించాలో వారికి చెల్లిస్తారు. లబ్దిదారులకు నేరుగా నగదు చేతికి అందదు. కానీ వ్యాపారం లేదా ఉపాధి మాత్రం వారికి లభిస్తుంది.
కేసీఆర్ అందరికీ దళిత బంధు ఇస్తామని చెబుతూంటే.. కొత్తగా మార్గదర్శకాలు ఏమిటన్న విమర్శలు సహజంగానే రాజకీయ పార్టీలు చేస్తూంటాయి. ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే నాలుగో దశలో ఇస్తామని చెప్పారు. మొదటిదశగా ఇలా పేదల్ని ఎంపిక చేస్తున్నట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం హుజురాబాద్‌లో చేస్తున్న సర్వే తర్వాత మొదటి దశలో ఎంత మంది లబ్దిదారులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.