Karnataka High Court: పెళ్లి తర్వాత భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు తన వివాహం పరిపూర్ణం కాలేదంటూ తన భర్త, అత్తమామలపై ఓ మహిళ పెట్టిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టి వేసింది. 


అసలేం కేసు ఏంటంటే?


2019 డిసెంబర్ 18వ తేదీన ఓ జంటకు పెళ్లి జరిగింది. అయితే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే ఆమె భర్త.. ఆమెతో శారీరక బంధాన్ని ఏర్పరుచుకునేందుకు నిరాకరించాడు. దీంతో కేవలం 28 రోజులు మాత్రమే ఆమె అత్తింట్లో ఉంది. ఆపై భర్త తనను దగ్గరకు రానివ్వడం లేదంటూ పుట్టింటికి వచ్చేసింది.


ఈక్రమంలోనే 2020 ఫిబ్రవరిలో ఐసీపీ సెక్షన్ 498ఏ, వరకట్న నిషేధ చట్టం 1961లోని సెక్షన్ 4 కింద భర్త, అత్తామామలపై కేసు పెట్టింది. అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పూర్తి కాలేదని, తన పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఈమె పిటిషన్ ను పరిశీలించిన కుటుంబ న్యాస్థానం 2022 నవంబర్ లో వీరి వివాహాన్ని రద్దు చేసింది. అయితే అత్తింటి వారిపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు. దీంతో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను భర్త.. కర్ణాటక హైకోర్టులో సవాలు చేశాడు. 


దీనిపై ఇటీవల విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భర్తపై ఉన్న ఏకైక ఆరోపణ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆయన.. ప్రేమ అంటే కేవలం మనసులకు సంబంధించినది మాత్రమే గానీ.. శారీరక బంధం కాదని విశ్వసించాడని.. దీన్ని తాను కూడా నమ్ముతున్నానని జస్టిస్ ఎం నాగప్రసన్న అంగీకరించారు. అయితే వివాహం చేసుకున్న భార్యతో శారీరక బంధాన్ని నిరాకరించడం, హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వమే అవుతుందని ధర్మాసనం తెలిపింది. కానీ ఐసీపీ సెక్షన్  498ఏ ప్రకారం అది నేరం కిందకు రాదని వెల్లడించింది. అందువల్ల ఈ కేసులో భర్తపై క్రిమినల్ చర్యలు చేపడితే అది వేధింపుల కిందకే వస్తుందని వివరించింది. అందువల్ల ఈ పిటిషన్ ను అంగీకరించి అతడిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టేస్తున్నట్లు స్పష్టం చేసింది. 


Also Read: భారత్‌లో కాల్‌సెంటర్‌-అమెరికాలో మోసాలు, అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్‌ను పట్టుకున్న దిల్లీ పోలీసులు


Also Read: కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం, భయంతో బిల్డింగ్ నుంచి దూకేసిన ప్రజలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial