Chhattisgarh Korba Fire Accident: ఛత్తీస్‌గఢ్‌ లోని కోర్బా జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్బా జిల్లాలోని ట్రాన్స్ పోర్ట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బ్యాంకులు, ఎలక్ట్రానిక్స్, వస్త్ర దుకాణాలు ఉన్న కాంప్లెక్స్ లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగి నిమిషాల వ్యవధిలో మంటలు భవనమంతా వ్యాపించాయి. ప్రాణ భయంతో కాంప్లెక్స్ బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కొందరు కిందకు దూకేశారు. అగ్ని ప్రమాదం ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న కొందరు వీడియోలు తీసి పోస్ట్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్ నాలుగు రోజుల కిందట అగ్ని ప్రమాదం జరగగా, విద్యార్థులు బిల్డింగ్ పై నుంచి కిందకి దూకేశారు. ఛత్తీస్ గఢ్ లో తాజాగా అదే తరహాలో కొందరు ప్రాణ భయంతో కిందకి దూకి గాయపడ్డారు.






బ్యాంక్‌తో పాటు వస్త్ర దుకాణం ఉన్న కాంప్లెక్స్ కు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం కావడంతో కాంప్లెక్స్ లోని పలు షాపులు, ఆఫీసుకు కాలిపోయాయి. తొలుత బ్యాంకులో మంటలు చెలరేగగా.. నిమిషాల వ్యవధిలోనే చుట్టుపక్కల దుకాణాలు, ఆఫీసులకు వ్యాపించాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు తొలి అంతస్తులో కిటికీ నుంచి కొందరు కిందకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. గాయాపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని, త్వరలోనే పూర్తి వివరాలు చెబుతామన్నారు అధికారులు. 






కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, వైర్‌లు పట్టుకుని బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థులు
ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో జూన్ 15న అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు. కోచింగ్ సెంటర్‌లో ఉన్న విద్యార్థులు వైర్‌లు పట్టుకుని కిందకు దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిల్డింగ్‌లో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఎవరికీ తీవ్ర గాయాలవ్వలేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రిసిటీ మీటర్‌లో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఒక్కసారిగా ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. 11 మంది సిబ్బంది వెంటనే వైర్‌ల సాయంతో అందరినీ కిందకు తీసుకొచ్చారు. విద్యార్థులందరూ సేఫ్‌గా బయటపడ్డారు. 


"అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొందరు విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. బిల్డింగ్‌లో ఎవరూ చిక్కుకోలేదు. ఎలక్ట్రిసిటీ మీటర్‌లో లోపం తలెత్తడం వల్ల అగ్నిప్రమాదం జరిగింది. పొగ రావడం వల్ల అంతా ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడింది"


- సుమన్ నల్వా, ఢిల్లీ పోలీస్ పీఆర్వో