International Cyber Crime: భారత్ లో కాల్ సెంటర్ నిర్వహింస్తూ అమెరికన్లకు ఫోన్లు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ సహకారంతో దిల్లీ పోలీసులు ఈ ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ సిండికేట్ ముఠా సభ్యులను పట్టుకున్నారు. యూఎస్ డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్(DEA)కి చెందిన ఉన్నత స్థాయి అధికారి వలె మాట్లాడుతూ అమెరికా పౌరుల నుంచి 20 మిలయన్ డాలర్లకు పైగా మోసగించారు. భారత దేశ కరెన్సీ ప్రకారం రూ.163 కోట్లకు పైగా మోసం చేశారు. ఈ కాల్ సెంటర్ ముఠాకు చెందిన ఆరుగురుని అరెస్టు చేశారు. ఇందులో భారత్ నుంచి నలుగురు, ఉగాండాలో ఒకరు, కెనడాలో మరొకరిని అరెస్టు చేశారు.
సూత్రధారులను అరెస్టు చేసిన అధికారులు
అరెస్టు అయిన వారిలో వత్సల్ మెహతా, పార్థ్ అర్మార్కర్, దీపక్ అరోరా, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. ఇందులో అర్మార్కర్ ఉగాండా, భారత్ లో కాల్ సెంటర్లను నిర్వహిస్తుండగా, మెహతా వాటి ఆపరేషన్ వెనక కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఉత్తమ్ ధిల్లాన్ అనే సీనియర్ DEA అధికారి వలె మాట్లాడుతూ బాధితులకు ఫోన్లు చేసి మోసం చేస్తున్నారు. గుజరాత్ కు చెందిన పార్థ్ అర్మార్కర్ ఉగాండాలోనే చాలా కాలంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడే ఉంటూ కాల్ సెంటర్లు నడుపుతున్నాడని ఎఫ్‌బీఐ తెలియజేసినట్లు దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీసు హెచ్‌సీఎస్ ధలివాల్ తెలిపారు. అమెరికా డీఈఏ ఉత్తమ్ ధిల్లాన్ అనే సీనియర్ అధికారిలా ఫోన్లు చేస్తూ మోసాలు చేస్తున్నట్లు చెప్పారు.
మోసాలు ఎలా చేస్తారంటే?
యూఎస్-మెక్సికో సరిహద్దుల్లో తమకు పిల్లల అశ్లీల వస్తువులు దొరికాయని చెబుతారు. ఆ కేసును విచారిస్తుండగా మీ కాంటాక్ట్ నంబర్ దొరికిందని అంటారు. చైల్డ్ పోర్నోగ్రఫీ తీవ్రమైన నేరం కాబట్టి అదే విషయాన్ని చెప్పి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెడతారు. దీని నుంచి బయట పడాలంటే పెనాల్టీ కింద కొంత మొత్తం చెల్లించాలని అంటారు. దీంతో భయపడి వారు డబ్బు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందుకోసం ఈ ముఠా సంపన్న వ్యక్తులనే ఎంచుకుంటుంది. వారు ఈ కేసులో ఇరుక్కుంటే ఎక్కడ పరువు పోతుందోనని భయపడతారు. అలా వారి నుంచి డబ్బు లాగుతారు. ఇంటర్నెట్ లో అమెరికా DEA అధికారి ఎవరూ అని వెతికినా వారికి ఉత్తమ్ ధిల్లాన్ అనే కనిపిస్తుంది. దాంతో వారికి వచ్చిన కాల్ నిజమే అని నమ్ముతారు. తర్వాత డబ్బు పంపిస్తారు. బాధితులను ఎంచుకునే ముందు ఈ ముఠా పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తుంది. సంపద ఉండి, సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా లేని ఒంటరి వ్యక్తులనే ఎంచుకుని పథకం ప్రకారం మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఉగాండా, భారత్‌ల నుంచి మోసాలు
ఈ ముఠా ప్రధానంగా ఉగాండా నుంచి పనిచేస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే భారత్ కాల్ సెంటర్ నుంచి కాల్స్ వెళ్తుంటాయి. భారత్ లో ఇలాంటి మోసాలు చేస్తే గనక ఇక్కడ వారు డబ్బుకు బదులు బంగారం ఇవ్వాలంటారు.
ఈ ఆన్‌లైన్ కాల్ సెంటర్ సిండికేట్ లో మోసపోయిన 50 మంది బాధితులను ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో మోసపోయిన మొత్తం 20 మిలియన్ డాలర్లు అంటే రూ. 163 కోట్లకు పైగా ఈ ముఠా కాజేసినట్లు ఎఫ్‌బీఐ అంచనా. ఈ కేసులో మోసపోయిన వారు మరింత మంది ఉండొచ్చని, వారిప్పుడు ముందుకొస్తారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భావిస్తున్నారు. డార్క్ వెబ్ ను ఉపయోగించి చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఎప్పుడో ఒకప్పుడు ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూసిన బాధితులు.. ఈ ముఠా నుంచి ఫోన్ రాగానే నిజమే అనుకుని డబ్బులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.