TTD Key Decisions: తిరుమల: సనాతన ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో తిరుమలలో శ్రీవాణి ట్రస్టును తీసుకొచ్చామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక‌మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీలో పలు అభివృద్ధి పనులకు దాదాపు 250 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ నిర్మాణానికి 4.15 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు.  హెచ్.వి.సి లో 144 గదుల ఆధునికీకరణ రూ 2.35 కోట్ల రూపాయలను మంజూరు చేశాంమని చెప్పిన ఆయన, కాటేజీల ఉపవిచారణ కార్యాలయాలు ఆధునీకరణకు 1.68 కోట్లు అమోదం తెలిపాంమన్నారు
3 ఏళ్ల పాటు వేస్ట్ మ్యానేజ్మెంట్ నిర్వహణకు 40.50 కోట్లతో ఓ ప్రైవేటు కంపెనీకి టెండర్ ఖరారు చేశాం, ఎఫ్.ఎం.ఎస్ సేవలకు 29.50కోట్ల రూపాయల నిధులు కేటాయించాం అన్నారు. ఒంటిమిట్టలో దాతల సహకారంతో 4 కోట్ల అన్నదాన భవనంను నిర్మించనున్నామని, 3.55 కోట్లతో తిరుమలలో పోలీస్ క్వార్టర్స్ లో మరమ్మత్తులు నిర్వహించేందుకు నిధులు కేటాయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.3.10 కోట్లతో వివిధ ప్రాంతాల్లో స్టెయిన్ లెట్ స్టీల్ చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, తిరుపతి ఎస్వీ వేదిక వర్సిటీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి 5 కోట్లు రూపాయలు ఇవ్వాలని, 7.44 కోట్లతో టీటీడీకి అవసరపడ్డ అధునాతన కంప్యూటర్లు కొనుగోలు చేశామన్నారు. 


టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి రూ 3.80 కోట్ల రూపాయల నిధులకు గానీ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇక నగరి నియోజకవర్గంలోని బుగ్గలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో కళ్యాణమండపం నిర్మాణానికి 2 కోట్లు రూపాయలు మంజూరు ‌చేశాం. తిరుపతిలోని‌ స్విమ్స్ నిర్వహణను పూర్తి స్థాయిలో టీటీడీ తీసుకునే విధంగా పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. 1,200 పడకలతో స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి, 97 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం చేపట్టేందుకు పాలక మండలి ఆమోదం తెలపడంతో పాటుగా, తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ అమరిక 6 కోట్ల రూపాయల నిధులను ఇస్తామన్నారు. 


తిరుపతి రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 5.16 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని, జమ్మూలో 24 నెలల వ్యవధిలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి, వైభవంగా ఆలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పట్టణాలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు, కళ్యాణమండపాలు నిర్మిస్తున్నాంమని, గుజరాత్ గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాయపుర్ లో త్వరలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేస్తాంమని ఆయన తెలిపారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం జరుగుతొందని దుష్ప్రచారం చేస్తున్నారని, కొందరు వైసిపీ నాయకులు శ్రీవాణి ట్రస్ట్ నిధులు దోచుకుంటున్నారని అబద్ధపు ప్రచారం జరుగుతుందని, సనాతన ధర్మాన్ని కాపాడే గొప్ప లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చాం అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2600 ఆలయాలు నిర్మాణం చేస్తున్నాంమని, ఇప్పటి వరకూ శ్రీవాణి ‌నిధులతో దాదాపు 300 పురాతన ఆలయాల‌ జీర్ణోద్ధరణ చేస్తున్నామని, ఆలయాల్లో దీపధూప నైవేద్యాలకు, గోశాలలు సంరక్షణ, హిందూ ధర్మప్రచారాలకు శ్రీవాణి నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఆయన అన్నారు. 


పారదర్శకంగా శ్రీవాణి ట్రస్ట్ నడుపుతుంటే, రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై న్యాయ సలహా మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాలు, పేలుడు పద్ధార్థాలను గుర్తించే పరికరాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా యాగంటిలో 2.45 కోట్లతో కళ్యాణమండపం నిర్మాణం చేపట్టేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.