Iran Hijab Protest: ప్రపంచవ్యాప్తంగా హిజాబ్‌పై వివాదం కొనసాగుతూనే ఉంది. కొందరు హిజాబ్ ధరించడాన్ని సపోర్ట్ చేస్తుంటే..ఇంకొందరు ఈ కాలంలో ఈ నిబంధన ఎందుకు అని వాదిస్తున్నారు. ఒక్కోసారి ఇది సమాజంలో అలజడికీ కారణమవుతోంది. ఆ మధ్య కర్ణాటకలో దీనిపై ఎంత పెద్ద ఘర్షణలు జరిగాయో చూశాం. ఇప్పుడు ఇరాన్‌లోనూ హిజాబ్ విషయమై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.
పశ్చిమ ఇరాన్‌లో మహిళలు ఆందోళనలు చేపడుతున్నారు. సెప్టెంబర్ 17న ఓ పోలీస్ అధికారి హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలని ఓ యువతిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె హిజాబ్ ధరించనుందుకు అరెస్ట్ కూడా చేశాడు. ఈ క్రమంలోనే ఆమె మృతి చెందింది. 22 ఏళ్ల మహ్‌సా అమినిని పోలీసులే హింసించి చంపారని ఇరాన్ మహిళలు నినదించారు. రోడ్డుపైనే హిజాబ్‌లు తొలగించి నిరననలు వ్యక్తం చేశారు. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ జుట్టును కత్తిరించుకుని, వారి హిజాబ్‌లకు నిప్పంటించారు.
యువతి మరణానికి కారణమైన పోలీస్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు జర్నలిస్ట్‌లు కూడా మహిళలకు మద్దతుగా నిలిచారు. "ఇరాన్‌లో హిజాబ్ ధరించకపోవటం శిక్షార్హమైన నేరమైపోయింది. దీన్ని ఖండించేందుకు దేశమంతా ఒక్కటి కావాలి" అని ట్విటర్ వేదికగా పోస్ట్‌లు చేశారు. ఇంకొందరు పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పుడే కాదు. కొంత కాలంగా హిజాబ్‌పై ఇరాన్‌లోప్రభుత్వం, మహిళల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణమే ఉంది.
దాడి చేయలేదు
ప్రభుత్వం మరీ క్రూరంగా ప్రవర్తిస్తోందని మహిళలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. కావాలనే కొందరు మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లను తొలగిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆ యువతి మరణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తున్నారు. అరెస్ట్ అయ్యే సమయానికే ఆమె అనారోగ్యంతో బాధ పడుతోందని, ఆ తరవాత అనుకోకుండా ఆమె చనిపోయిందని చెబుతున్నారు. ఆమెపై భౌతికంగా ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేస్తున్నారు. కానీ...మహిళల ఆగ్రహావేశాలు మాత్రం చల్లారడం లేదు.
Also Read: యూరప్‌లో ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించిన తెలంగాణ కుర్రాడు, హర్యానా గవర్నర్ అభినందనలు
Also Read: Viral Video: బ్యాగులోని ఆపిల్ ను కొట్టేసిన కోతి ఎలా పారిపోతుందో చూడండి?