Bhukya Yashwanth Naik scaling Mount Elbrus Russia: యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించాడు తెలంగాణ కుర్రాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన భూక్య యశ్వంత్‌ నాయక్‌ 6 రోజుల సాహసయాత్ర చేసి శుక్రవారం ఉదయం మౌంట్‌ ఎల్‌బ్రస్ పర్వతాన్ని ఎక్కి రికార్డు సృష్టించాడు. ఎత్తైన శిఖరం ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన 18 సంవత్సరాల యువకుడు భూక్య యశ్వంత్‌ నాయక్‌‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు.


ఫోన్ చేసి మాట్లాడిన హర్యానా గవర్నర్..
రష్యాలోని ఎత్తైన శిఖరం ఎల్‌బ్రస్  పర్వతాన్ని అధిరోహించి అక్కడ మన జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు భూక్య యశ్వంత్‌ నాయక్‌‌కు అభినందనలు తెలిపారు బండారు దత్తాత్రేయ. ఫోన్ కాల్ చేసిన మాట్లాడిన ఆయన.. అతి చిన్న వయస్సులో, రష్యాలో ఎత్తైన  మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించి, మీరు తెలంగాణతో పాటు యావత్ జాతి గర్వించేలా చేశారని యువకుడ్ని అభినందించారు (Haryana Governor congratulates Bhukya Yashwanth Naik). ఎవరెస్ట్ శిఖరంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరెన్నో శిఖరాలను మీరు అధిరోహిస్తారని తాను విశ్వశిస్తున్నానని చెప్పారు. యశ్వంత్ కు ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని బండారు దత్తాత్రేయ.. యశ్వంత్ కి ఫోన్లో తెలియజేశారు  


మహబూబాబాద్ ముద్దుబిడ్డ.. 
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన భూక్య యశ్వంత్‌ నాయక్‌‌ పర్వతారోహకుడు. వారిది రైతు కుటుంబం. భూక్యా రాంమూర్తి నాయక్, జ్యోతి దంపతుల కుమారుడైన యశ్వంత్ నాయక్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఈ 18 ఏళ్ల యువకుడు రష్యాలోని అత్యంత ఎత్తైన 5,642 మీటర్ల మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. సెప్టెంబర్ 10న రష్యా చేరుకున్న యశ్వంత్.. మరుసటిరోజు మౌంట్ ఎల్‌బ్రస్ అధిరోహణ ప్రారంభించాడు. అయితే మైనస్‌ 22 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకొని శుక్రవారం ఉదయం రష్యాలోని అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. 





యశ్వంత్‌ గతంలో దక్షిణాఫ్రికా టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని కూడా అధిరోహించాడు. లడఖ్ లోని ఖార్దుంగ్ లా పర్వతాన్ని సైతం అధిరోహించాడు. యశ్వంత్‌ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అంబరిల్లా ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ సహకారం అందించారు.


భూక్య యశ్వంత్ నాయక్ (Bhukya Yashwanth Naik) శుక్రవారం ఉదయం 8:51 గంటలకు రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడని హరియాణా గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నాగేష్ తెలిపారు. కఠోర శ్రమతో మైనస్ 22 డిగ్రీల సెల్సియస్ చలిలోనూ 5,642 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడని వివరించారు.