ప్రేమకు ప్రతిరూపం అమ్మ. తమ పిల్లని సమాజంలో మంచివారిలాగా తీర్చిదిద్దేందుకు జీవితాంతం వరకు పాటుపడుతుంది. అడుగడుగునా అమ్మ అండదండలు, దీవెనలు లేనిదే మానవ మనుగడే లేదు అంటే అతిశయోక్తి కాదు. మరి ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా అమ్మతనని తాను మార్చుకోవడం కూడా చాలా అవసరం. మరి ఈ క్రమంలో ఈతరం అమ్మకు ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు ఏమిటీ ఓసారి చూద్దాం.
సాంకేతిక పరిజ్ఞానం అత్యవసరం
పిల్లలకు తొలి గురువు అమ్మ. ఇంకా బడికి వెళ్లకముందే మనతో అక్షరాలను దిద్దిస్తుంది. మాటలను నేర్పిస్తుంది. ఇక స్కూలుకు వెళ్లడం మొదలెట్టాక ఇంట్లో చదువు చెప్పడం, పరీక్షలకు తయారు చేయడం ఇలా చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు స్కూల్లోనే అన్నీ చెప్పేవారు కానీ కాలంతోపాటు విద్యావిధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆన్ లైన్ విద్యాబోధన చాలా చోట్ల జరుగుతోంది. నిన్నమొన్నటి వరకు మన ప్రభుత్వం కూడా కరోనా కాలంలో ఆన్ లైన్ విద్యాబోధనకు మద్ధతునిచ్చింది.. తరగతి గదుల్లో కూడా పీసీలు, ట్యాబ్‌లు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో అందరు తల్లులు వాళ్ల పిల్లల్ని చదివించడానికి కావాల్సిన కనీస సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం మంచిది. అలాగే వారు ఈ గ్యాడ్జెట్ల ద్వారా చదువుకునేటప్పుడు ఏమైనా సోషల్ మీడియా యాప్స్ కు బానిసలు అవుతున్నారా అనే విషయాన్ని గ్రహించేంత పరిజ్ఞానం కూడా ఈ తరం తల్లులకు అత్యవసరం. తద్వారా పిల్లలు పక్కదారి పట్టకుండా చూసుకోవచ్చు.
పిల్లలతో సమయాన్ని గడపండి
ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులూ ఉద్యోగాలు చేయడం అత్యవసరం. కానీ వారి వారి ఉద్యోగాలతో బిజీగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడపని వారు చాలామందే ఉన్నారు. కానీ దీనివల్ల పిల్లల్లో తల్లిదండ్రులు మమల్ని పట్టించుకోట్లేదు అన్న భావన బలపడిపోతుంది. అది పిల్లల భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు. ఉద్యోగం ఎంత ముఖ్యమో పిల్లలను చూడడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సెలవు రోజుల్లో లేదంటే వర్కింగ్ డే లోనే వీలు చూసుకొని వాళ్లతో సమయం గడపడం, వాళ్లను బయటికి తీసుకెళ్లడం, ఇంట్లో వాళ్లకిష్టమైన ఆహార పదార్థాలు తయారుచేసి పెట్టడం.. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మిస్ అయ్యాము అన్న భావన వారిలో తొలగిపోతుంది. అంతేకాదు వారికి ఇంటిపని, కొత్తకొత్త అంశాలను వీలు చిక్కినప్పుడల్లా నేర్పించాలి. తద్వారా వారికి కొత్త అంశాలు నేర్పించినట్లవుతుంది. మీరు వారితో సమయం గడపినట్లుగానూ ఉంటుంది. దీనివల్ల తల్లీబిడ్డల అనుబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది.
శారీరకంగానూ...మానసికంగానూ..
ఎదిగే పిల్లలను శారీరకంగానూ..మానసికంగానూ బలంగా తయారయ్యేలా సన్నద్ధం చేయడం అతి ముఖ్యం. ఈ మధ్య ఏ వయసు వారికైనా వ్యాయామం ఓ అలవాటుగా మారిపోయింది. ఇంటి పనులు, ఆఫీసు పనులతో సమానంగా ఎక్సర్ సైజుకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలను కూడా మీరు చేసే వ్యాయామాల్లో భాగం కల్పించడం ఉత్తమం. ఫలితంగా వారికి వారికి మంచి అలవాటు నేర్పించినట్లుగా ఉండడంతోపాటు.. వారు శారీరకంగా, మానసికంగా, దృఢత్వాన్ని పొంది కేరీర్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.
నలుగురితో కలిసేలా
ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులు కావడం వల్ల ఇద్దరూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎటూ వెళ్లలేక ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు. ఇక చుట్టాలు, స్నేహితులు ఎవరెవరనేది అసలు తెలియట్లేదు. దీంతో వాళ్ల పిల్లలకు బంధువులెవరు వాళ్లతో ఎలా మెలగాలి గ్రాండ్ పేరెంట్స్‌తో అనుబంధం ఎలా ఉండాలి ఎవరికెంత గౌరవం ఇవ్వాలి వంటి విషయాల్లో కనీస అవగాహన లోపించే అవకాశం ఉంటుంది. ఇది పిల్లలకు అంత మంచిది కాదు. కాబట్టి ఖాళీ సమయం దొరికినప్పుడ్లలా వారిని బంధువుల ఇళ్లకు తీసుకెళ్లడం, ఫోటో ఆల్బమ్స్ చూపిస్తూ ఈమె మీ అమ్మమ్మ ఈయన మీ తాతయ్య, ఈమె మీపిన్ని.. ఇలా మీ బంధుత్వాల గురించి తెలియజేయడం చాలా ముఖ్యం ఫలితంగా మీరు వాళ్లింటికి వెళ్లినప్పుడు మీ పిల్లలు వారితో సులభంగా కలిసిపోయే అవకాశం ఉంటుంది.