సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తో సినిమా చేసే అవకాశం, ఆయన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. 'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అంటూ ఆయన దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే... రజనీకాంత్ ఒక ఛాన్స్ ఇవ్వమని మణిరత్నాన్ని రిక్వెస్ట్ చేశారు.
'పొన్నియన్ సెల్వన్'లో రజనీ నటిస్తానంటే...
మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan Movie). ఇందులో విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్లు. ప్రకాశ్ రాజ్, పార్తీబన్, మలయాళ నటుడు జయరామ్ తదితరులు సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఆ రోల్స్‌లో ఏదో ఒక రోల్ చేస్తానని మణిరత్నాన్ని రజనీకాంత్ అడిగారు.
''నేను నిజంగా రజనీకాంత్ ఫ్యాన్ బేస్‌ను శాటిస్‌ఫై చేయలేను... అందుకని, 'పొన్నియన్ సెల్వన్'లో ఆయన సపోర్టింగ్ రోల్ చేస్తానని రిక్వెస్ట్ చేస్తే సున్నితంగా తిరస్కరించాను'' అని చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో మణిరత్నం వెల్లడించారు. అతిథి పాత్రలో అయినా సరే రజనీని చూపించడం కష్టమనేది ఆయన అభిప్రాయం. 'పొన్నియన్ సెల్వన్' ఆడియో వేడుకలో మణిరత్నాన్ని రిక్వెస్ట్ చేసిన విషయం రజనీ వెల్లడించారు. రజని విజ్ఞప్తిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందనేది తాజాగా మణిరత్నం తెలిపారు.
కమల్‌కు కుదరలేదు
'పొన్నియన్ సెల్వన్' సినిమాను కమల్ హాసన్‌తో చేయాలని 1989లో మణిరత్నం ప్రయత్నించారు. అయితే, అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. కమల్ హాసన్ చేయకపోవడం వల్ల తమకు అవకాశం వచ్చిందని ఇటీవల చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన ఆడియో వేడుకలో హీరో కార్తీ అన్నారు. కమల్ హాసన్‌కు థాంక్స్ చెప్పారు. కమల్ చేయాలనుకున్న పాత్ర తాను చేశానని ఆయన తెలిపారు.
ఆడియో వేడుకలో సందడి చేసిన రజనీకాంత్, కమల్ హాసన్
'పొన్నియన్ సెల్వన్' ఆడియో వేడుకలో స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ సందడి చేశారు. వాళ్ళిద్దరి పలకరింపు, ఆత్మీయ కౌగిలింత అందరి దృష్టిని ఆకర్షించాయి.
రెండు సినిమాలు 155 రోజుల్లో పూర్తి
'పొన్నియన్ సెల్వన్'ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది విడుదలైన ఆరు నుంచి తొమ్మిది నెలలకు రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. రెండు భాగాలను 155 రోజుల్లో పూర్తి చేశామని 'జయం' రవి తెలిపారు. మణిరత్నం లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు.
Also Read : భర్తకు నయనతార సర్‌ప్రైజ్... అక్కడికి తీసుకువెళ్ళి మరీ
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న (Ponniyin Selvan Release Date) భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
Also Read : నా కథలు దేశం దాటి వెళతాయనుకోలేదు - హాలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌పై రాజమౌళి