15-Aug-2019న అంటే 73వ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోడీ.. కీలక ప్రకటన చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని త్వరలో నియమించనున్నట్టు ఎర్రకోట మీద నుంచి ప్రకటించారు. ఆ తర్వాత సీడీఎస్‌ బాధ్యతలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కమిటీ నివేదికను పరిశీలించిన కేబినెట్‌ కమిటీ కూడా ఆమోదించింది.
ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ 2019‌‌ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా 2020 జనవరి 1న నియమితులయ్యారు.


సీడీఎస్ అంటే ఏంటి?
వాస్తవానికి, సింగిల్ పాయింట్ మిలటరీ సలహాదారు పోస్టును సృష్టించడం అనేది కార్గిల్ అనంతర జరిగిన చర్చలలో ఒక భాగం. సైన్యం, నేవీ, వైమానిక దళాల అధిపతుల కంటేపై స్థానంలో ఉండే సీడీఎస్, ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు. భారత సైన్యం, భారత నౌకాదళం, భారత వాయుసేనతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పని చేస్తారు.  సైన్యంలోని మూడు విభాగాలకు సంబంధించిన విషయాలపై సలహాలు, సూచనలు ఇస్తారు. త్రివిధ దళాలను ఏకీకృతం చేయడమే దీని లక్ష్యం.


సీడీఎస్‌ ప్రధాన బాధ్యత త్రివిధ దళాలను సమన్వయం చేయడం. మూడు దళాల సంయుక్త వ్యూహాలు, కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వడం. రక్షణ అంశాలకు సంబంధించిన సైనిక వ్యవహారాల్లో నైపుణ్యాలను పెంపొందించడం. త్రివిధ దళాల సంస్థల పాలనా పరమైన బాధ్యతలను సీడీఎస్‌ నిర్వహిస్తారు.


త్రివిధ దళాలకు సంబంధించిన ప్రణాళికలు, శిక్షణ, బడ్జెటింగ్ ఇలా అన్ని వేరు, వేరుగా ఉండేవి. సీడీఎస్ ఈ వ్యవహారాలతో పాటూ.. త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా పోస్టును క్రియేట్ చేశారు. ఇటు త్రివిధ దళాల అధిపతులు తమ విధులపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టేందుకు కూడా పూర్తి స్థాయి అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ అభిప్రాయం. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వానికి ఒకే-పాయింట్ సైనిక సలహాను అందించడంలోనుంచి పుట్టిందే సీడీఎస్ పోస్ట్.


సీడీఎస్ పోస్ట్ గురించి గతంలో కూడా ప్రస్తావన వచ్చింది. 1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత ఏర్పాటైన కె.సుబ్రహ్మణ్యం కమిటీ తొలిసారి సీడీఎస్‌ నియామకాన్ని సిఫార్సు చేసింది. 2012లో ఏర్పాటైన నరేశ్‌ చంద్ర కమిటీ ఇదే నిర్ణయాన్ని తెలిపింది. 2016లో డీబీ షెట్కర్ కమిటీ కూడా సీడీఎస్ నియామక అవసరం ఉందని అభిప్రాయపడింది. తర్వాత కొన్ని రోజుల వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత.. కొన్ని రోజులకు మెుట్టమెుదటి సీడీఎస్ గా బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు.


రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా కొన్ని దేశాల్లో జాతీయ స్థాయిలో  సీడీఎస్ లాంటి పోస్టుల నియామకం జరిగింది. కానీ భారతదేశంలోనే జరగలేదు. కొన్ని దేశాలు ఈ అపాయింట్‌మెంట్ కోసం వేర్వేరు పేర్లను ఉపయోగించాయి. కానీ కేటాయించిన విధులు ఒకటే.


Also Read: Chopper Crash Coonoor: కుప్పకూలిన సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్.. 8 మంది మృతి


Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష


Also Read: CDS Bipin Rawat Chopper Crash Live: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంటులో గురువారం ప్రకటన