Udaipur Murder Case: ఉదయ్‌పుర్ టైలర్ హత్య కేసు నిందితుల దర్యాప్తు రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హంతుకులు ఇద్దరికీ ఐసిస్‌తో సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. వీరు జైపుర్‌లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


మరో వ్యాపారిని


ఈ ఇద్దరు నిందితులు ఉదయ్‌పుర్‌లో మరో వ్యాపారిని హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. జైపుర్‌లో వరుస పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులిద్దరినీ దిల్లీకి తీసుకువచ్చి విచారణ జరిపి, వారి మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. నిందితులు ఐసిస్ వీడియోలను స్ఫూర్తిగా తీసుకుని హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.


నిందితుల్లో ఒకడైన గౌస్ 2014లో జోధ్‌పుర్ మీదుగా కరాచీకి 30 మందితో కలిసి వెళ్లి పాకిస్థాన్ దావత్-ఎ-ఇస్లామీలో 45 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు పాకిస్థాన్‌లోని ఎనిమిది మొబైల్ నంబర్లతో టచ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగనున్నట్లు సమాచారం.


ఇదీ జరిగింది


మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌ మాల్దాస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.


ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  భాజపా సస్పెండ్‌ చేసిన నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.


వెంటనే అరెస్ట్


ఈ దారుణానికి తెగబడిన నిందితులను రియాజ్‌ అక్తర్‌, గౌస్‌ మొహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్‌.. టైలర్ గొంతు కోయగా, గౌస్‌ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.


మరోవైపు సీఎం అశోక్‌ గహ్లోత్ సహా పోలీస్‌ శాఖ నిందితుల వీడియోలను వైరల్‌ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుక సహకరించాలని కోరారు.


Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఆరుగురు మృతి, 53 మంది మిస్సింగ్!



Also Read: MVA Crisis: శివసేన అధికారం కోసం పుట్టలేదు, అధికారమే శివసేన కోసం పుట్టింది: సంజయ్ రౌత్