మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్..?


మహారాష్ట్రలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరిగాయో, చివరకు అవి ఎక్కడికి దారి తీశాయో చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ఫ్లోర్‌ టెస్ట్ చేయకముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఉద్దవ్ థాక్రే. ఈ పరిణామం తరవాత అటు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవటం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వెనక భాజపా ఉందని మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేసేలాగే ఉంది భాజపా నేతల తీరు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన ఈ తరుణంలో...రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది భాజపా. దేవేంద్ర ఫడణవీస్‌ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. 


మహా రాజకీయాల్లో కీలకంగా ఆ ఇల్లు..


భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్, రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే కలిసి తదుపరి ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ముంబయిలోని మలబార్‌ హిల్స్‌లో ఉన్న ఫడణవీస్ ఇంట్లోనే పార్టీ నేతలంతా కలిసి తరవాతి వ్యూహాలు అమలుపై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫడణవీస్‌ ఇల్లు "షిండే క్యాంప్‌కి బ్యాక్ ఎండ్ ఆఫీస్‌"లాంటిది అని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 
ఇప్పుడు ఇదే ఇల్లు మహా రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించనుంది. ఈ పది రోజుల్లోనే పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు రెండు సార్లు ఫడణవీస్ ఇక్కడికి వచ్చారట. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేయటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
శివసేన నుంచి మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునేలా షిండేకు ప్లాన్ ఇచ్చింది భాజపాయే అన్నదీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. 


ఏక్‌నాథ్ షిండేకి డిప్యుటీ సీఎం పదవి..? 


ఇదంతా చేసినందుకు షిండేకు భాజపా మంచి గిఫ్టే ఆఫర్ చేయనుందని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మొదలు కాగానే ఏక్‌నాథ్ షిండేను ఉపముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలున్నాయి. షిండేకి మాత్రమే కాదు. థాక్రేలకు వ్యతిరేకంగా పోరాడటంలో తనకు సహకరించేందుకు మంత్రి పదవులు వదులుకున్న వారికీ..ప్రాధాన్యత దక్కనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్-BMCపై ఆధిపత్యం సాధించేందుకూ భాజపా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన కార్పొరేషన్ ఇది. ఓ రాష్ట్రానికి పెట్టేంత బడ్జెట్‌ ఈ కార్పొరేషన్ డెవలప్‌మెంట్‌ కోసం కేటాయిస్తారు. ఇంత కీలకమైన కార్పొరేషన్‌నూ దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది కాషాయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నందునఈ లోపు రాష్ట్రంపై పూర్తి స్థాయి పట్టు సాధించాలని భావిస్తోంది. ఇదన్నమాట విషయం.