Supreme Court: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో శివసేన పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని శివసేన అభ్యర్థించింది. అయితే ఈ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది.
ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. శివసేన చీఫ్ విప్ సునిల్ ప్రభు ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
ఇదీ జరిగింది
శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. దీంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్నీ వదులుకున్నారు. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని తేల్చుకున్న ఠాక్రే రాజీనామా చేశారు.
శాసనసభను గురువారం సమావేశపరిచి, బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ.. ముఖ్యమంత్రి ఠాక్రేను ఆదేశించారు. దీనిపై శివసేన అప్పటికప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించలేదు. గవర్నర్ ఆదేశాలను న్యాయస్థానం సమర్థించి, అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని చెప్పింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా విచారణ కొనసాగించి రాత్రి 9.15 గంటల సమయంలో తీర్పు వెలువరించింది. తీర్పును గౌరవిస్తున్నట్లు ఠాక్రే చెబుతూ.. పదవి నుంచి దిగిపోతున్నట్లు ప్రకటించారు.
అనంతరం భాజపా మద్దతుతో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
Also Read: Ukraine Crisis: పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ - ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ
Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం- సీఎం స్టాలిన్‌తో యశ్వంత్ సిన్హా భేటీ