Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిపుర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలానే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండ్‌ను మోదీ మరోసారి పుతిన్‌కు వివరించినట్లు తెలుస్తోంది.






దీంతో పాటు 2021 డిసెంబర్‌లో పుతిన్.. భారత్‌లో పర్యటించినప్పుడు జరిగిన ఒప్పందాల అమలుపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించినట్లు పీఎంఓ వెల్లడించింది.


యుద్ధం


మరోవైపు ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో కీలక పరిణామం జరిగింది. నల్లసముద్రంలోని వ్యూహాత్మక స్నేక్‌ ఐలాండ్ నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకుంది. ఉక్రెయిన్ ఓడరేవులను దిగ్భంధించి, ధాన్యం ఎగుమతులను అడ్డుకుంటూ ప్రపంచ ఆహార సంక్షోభానికి రష్యా కారణమవుతోందంటూ ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రష్యా తోసిపుచ్చుతోంది. ఈ నేపథ్యంలోనే స్నేక్‌ ఐలాండ్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.


ఇటీవల జీ7 దేశాల అధినేతల భేటీ జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై రష్యా విరుచుకుపడింది. పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్‌చుక్‌ నగరంలో ఉన్న షాపింగ్‌ మాల్‌పై సోమవారం క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో 1000కు పైగా పౌరులు ఆ ప్రాంతంలో ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.


ఈ దాడిలో 10 మంది పౌరులు మృతి చెందారని, 40 మందికి పైగా గాయాలయ్యాయని, ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.


దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగేలా ఉందని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌ బర్గ్‌ అంచనా వేశారు. యుద్ధానికి ముగింపు ఎప్పుడనేది ఎవరికీ తెలియదన్నారు. ఇది కొన్నేళ్లపాటు కొనసాగుతుందనుకుని సిద్ధపడాలన్నారు.


Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం- సీఎం స్టాలిన్‌తో యశ్వంత్ సిన్హా భేటీ


Also Read: Rare Pic: ఒకే వేదికపై యశ్వంత్ సిన్హా, ద్రౌపది ముర్ము- వైరల్ పిక్ చూశారా?