నెలనెలా 300 యూనిట్లు ఉచితం..


పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఓ కీలక ప్రకటన చేశారు. హామీ ఇచ్చినట్టుగానే ఆప్ సర్కార్ ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నట్టు వెల్లడించారు. వెంటనే ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది స్పష్టం చేశారు. జులై1వ తేదీ నుంచి 300 యూనిట్ల మేర విద్యుత్‌ని ఉచితంగా సరఫరా చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అందుకు అనుగుణంగానే మాట నిలబెట్టుకుంది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆమ్‌ఆద్మీ పార్టీ అధిష్ఠానం స్పందించింది. ఇదో చరిత్రాత్మక నిర్ణయమని, మిగతా రాష్ట్రాలకు ఇది ఆదర్శప్రాయమని కితాబునిచ్చింది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని, ఆ సమస్యను అధిగమించి ఉచిత కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదగటం పట్లఆనందం వ్యక్తం చేసింది.


ఇదో చరిత్రాత్మక నిర్ణయం..


"గత ప్రభుత్వాలెన్నో వచ్చాయి. హామీలు ఇచ్చాయి. కానీ వాటిని నెరవేర్చకుండానే ఐదేళ్లు గడిపి వెళ్లిపోయాయి. మా ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నం. పంజాబ్ చరిత్రలోనే ఇదో చరిత్రాత్మక నిర్ణయం. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో మరోటి నెరవేర్చబోతున్నాం. ప్రతి నెల ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నాం" అని ట్వీట్ చేశారు సీఎం భగవంత్ మాన్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. దిల్లీ తరవాత ఉచిత విద్యుత్ అందిస్తున్న రెండో రాష్ట్రంగా పంజాబ్ రికార్డుకెక్కిందని, ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయటం వల్ల రాష్ట్రంపై అదనంగా రూ. 1,800 కోట్ల భారం పడనుందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా వెల్లడించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలోనే ఈ విషయం స్పష్టం చేశారు.