Supreme Court Verdict:


పార్లమెంటు సభ్యులు(MPs), శాసనసభ సభ్యులు(MLAs) శాసనసభలో ప్రసంగించ‌డానికి(Speech) లేదా ఓటు(Vote) వేయడానికి లంచం(Bribe) తీసుకుంటే విచార‌ణ‌ నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు(Supreme court) సోమవారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచానికి రక్షణ లేదని కోర్టు తేల్చి చెప్పింది. అలాగే రాజ్యసభ(Rajyasabha) ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యే లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం(PCA) కింద విచారణ చేయవచ్చని కోర్టు పేర్కొంది. చట్టసభల అధికారాల ఉద్దేశ్యం, లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలని కోర్టు నొక్కి చెప్పింది. ఆర్టికల్స్(Article) 105(2) లేదా 194(2) సభ్యులకు స్వేచ్ఛా వాతావరణాన్ని క‌ల్పిస్తాయ‌ని తెలిపింది. ఈ సంద‌ర్భంగా మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు(Ex PM. PV Narasimharao) కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం(Constitution Bench) గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా ఏడుగురు న్యాయమూర్తుల ధ‌ర్మాస‌నం ఏకగ్రీవంగా కొట్టివేసింది. పీవీ నరసింహారావు కేసులో ఇచ్చిన‌ తీర్పు మేర‌కు.. లంచం స్వీకరించి తదనుగుణంగా ఓటు వేసే శాసనసభ్యుడికి రక్షణ ల‌భిస్తోంది. అయితే, లంచం తీసుకున్నప్పటికీ స్వతంత్రంగా ఓట్లు వేసిన శాసనసభ్యుడిని విచారించే విరుద్ధమైన పరిస్థితి ఏర్పడుతుందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(CJI) జ‌స్టిస్  DY చంద్రచూడ్, న్యాయమూర్తులు జ‌స్లిస్ AS బోపన్న, జ‌స్టిస్‌ MM సుందరేష్, జ‌స్టిస్ PS నరసింహ, జ‌స్టిస్ JB పార్దీవాలా, జ‌స్టిస్‌ సంజయ్ కుమార్, జ‌స్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 1998 నాటి తీర్పును తోసిపుచ్చింది. ఎవ‌రైనా స‌భ్యుడు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డితే అలాంటి వారికి ఆర్టికల్ 105 లేదా 194 ప్రకారం ఎలాంటి ర‌క్ష‌ణ ల‌భించ‌ద‌ని తీర్పు చెప్పింది. చట్టసభలో ఓటు వేయడానికి లేదా ప్రసంగించ‌డానికి లంచం ఆశించ‌డం నేర పూరిత చ‌ర్య‌గా పేర్కొంది. లంచం ఆశించ‌డం అనేది ఏ రూపంలో ఉన్నప్ప‌టికీ అది నేర పూరిత‌మేన‌ని కోర్టు పేర్కొంది.


అస‌లు ఏం జ‌రిగింది?


జార్ఖండ్ అధికార పార్టీ జార్ఖండ్‌ ముక్తి మోర్చా(JMM)కు చెందిన స‌భ్యురాలి అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012లో జ‌రిగిన‌ రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిష‌న్‌ను తిరస్కరించడంతో సీతా సోరెన్‌ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా? వారికి రక్షణ ఉంటుందా? అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అనంతరం ఈ కేసును ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(CJI) జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనికిగాను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.


కీల‌క తీర్పు.. 


తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపి సోమ‌వారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ప్ర‌సాదించిన‌ పార్లమెంటరీ అధికారాల ద్వారా అవినీతి నుంచి స‌భ్యుల‌కు ఎలాంటి రక్షణ ఉండబోదని ధ‌ర్మాసనం వెల్లడించింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజాజీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై వ‌చ్చే అవినీతి, లంచాల ఆరోప‌ణ‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు విచార‌ణ‌కు సైతం అనుమ‌తించ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. 


అప్ప‌ట్లో ఏం జ‌రిగింది? 


1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా( జేఎంఎం) ఎంపీగా ఉన్న శిబు సోరెన్‌ సహా ఇదే పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్‌ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.  దీనిని విచారించిన సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే.. దీనిని తాజాగా కొట్టి వేస్తూ తీర్పు వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం.