Sedition Law: రాజద్రోహ చట్టంలోని నిబంధనల(సెక్షన్ 124ఏ)ను పున:పరిశీలిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. ఇందులో మార్పులకు అవకాశముందని వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని కోరింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.
యూటర్న్
ఈ చట్టం విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు సుప్రీం కోర్టు మే 10 నుంచి విచారించనుంది. దీంతో కేంద్రం ముందురోజే కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ప్రభుత్వం మార్పుల కసరత్తును పూర్తి చేసేంతవరకు వేచివుండాలని విజ్ఞప్తి చేసింది.
ఏం చెప్పింది?
3 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కాలం చెల్లిన చట్టాలను తొలగించడంతోపాటు దేశ సౌర్వభౌమత్వం, రక్షణకు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మూలనపడేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించింది.
చట్టంలో ఏముంది?
రాజద్రోహం చట్టం...భారత శిక్షాస్మృతిలోని 124 ఏ సెడిషన్ చట్టం ప్రకారం మాటలు, రాతలు, సైగల ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి శత్రుత్వాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించినా, ప్రేరేపించినా వారికి జరిమానా, జీవిత ఖైదు విధించే వీలుంది. బ్రిటీష్ హయాం నాటి ఈ చట్టాన్ని దేశంలో రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు అధికారపక్షం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందని ఉద్యమకారులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు.
విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టం కింద అరెస్టయిన దాఖలాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ అరెస్టయింది ఈ చట్టం కిందనే. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ 2019 మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది.
Also Read: Vladimir Putin: 'మా జోలికొస్తే తరిమికొడతాం'- విక్టరీ డే పరేడ్‌లో పుతిన్ వార్నింగ్