Shaheen Bagh MCD Drive: 


దిల్లీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షహీన్‌భాగ్‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత కోసం మ‌ళ్లీ బుల్డోజ‌ర్లు క‌దిలాయి. ఇందుకోసం అధికారులు డ్రైవ్ చేప‌ట్టారు. దక్షిణ దిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ష‌హీన్‌భాగ్‌లో ఈ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే ఈ కూల్చివేతలను స్థానిక ప్రజలు, పలు పార్టీల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.






ఎప్పుడో చేయాలి


ఈ ప్రాంతంలో శుక్ర‌వార‌మే కూల్చివేత ప‌నులు జ‌ర‌గాల్సి ఉంది. కానీ భ‌ద్ర‌తా సిబ్బంది సంఖ్య త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా ఇవాళ మ‌ళ్లీ డ్రైవ్ చేప‌ట్టారు. ష‌హీన్‌భాగ్‌లోకి బుల్డోజ‌ర్లు రావ‌డంతో స్థానికులు ఆందోళ‌న‌కు దిగారు. రోడ్డుపై బైఠాయించి బుల్డోజ‌ర్ల‌ను అడ్డుకున్నారు. స్థానికులతో కలిసి ఆప్​ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్​ కూడా నిరసనల్లో పాల్గొన్నారు.






పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి(సీఏఏ) వ్య‌తిరేకంగా ష‌హీన్‌భాగ్‌లో కొన్నేళ్ల క్రితం నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఈ నిరసనలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది.


ఫిర్యాదుతో


తుగ్ల‌కాబాద్‌, సంగ‌మ్ విహార్‌, న్యూ ఫ్రెండ్స్ కాల‌నీ, ష‌హీన్ భాగ్ ప్రాంతాల్లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత జ‌ర‌గ‌నున్న‌ట్లు ఎస్డీఎంసీ చైర్మెన్ రాజ్‌పాల్ మీడియాతో తెలిపారు. అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌కు ప‌ది రోజుల కార్యాచ‌ర‌ణ‌ను ఎస్డీఎంసీ సిద్ధం చేసింది.


రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, సంఘ విద్రోహ‌శ‌క్తులు ఆక్ర‌మించిన అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేయాల‌ని దిల్లీ భాజపా నేత ఆదేశ్ గుప్తా న‌గ‌ర మేయ‌ర్‌ను ఇటీవ‌ల కోరారు. ఆ త‌ర్వాత అక్క‌డ బుల్డోజ‌ర్లు రంగంలోకి దిగాయి. కొన్ని రోజుల క్రితం దిల్లీలోని జ‌హంగిర్‌పురిలోనూ అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేశారు.


Also Read: NIA Raids: గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై NIA దాడులు


Also Read: Viral Video: మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటదో తెలుసా?- వైరల్ వీడియో