NIA Raids: అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేస్తోంది. దావూద్‌ లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.


ఏకకాలంలో






ముంబయిలోని బాంద్రా, నగ్‌పాడా, బొరివాలి, గోరేగావ్‌, పాలెల్‌, శాంతాక్రజ్‌ సహా మొత్తం 20 ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు.


దావూద్‌ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న వాళ్లు, షార్ప్‌ షూటర్లు, డ్రగ్‌ ట్రాఫికర్లు, రియల్‌ ఎస్టేట్‌ మేనేజర్ల ఇళ్లు, స్థావరాలపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు.


డీ కంపెనీ


నవాబ్ మాలిక్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లోని చాలా మంది అనుమానితులను కనుగొనే ప్రయత్నంలో ఉన్నట్లు ఎన్​ఐఏ వర్గాలు వెల్లడించాయి. దావూద్ ఇబ్రహీం కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు పని చేస్తున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నాయి.


దావూద్‌కు చెందిన డీ కంపెనీలోని అగ్రనాయకత్వం అండతోనే దేశంలో పలు నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. దీంతో దావూద్‌కు చెందిన స్థావరాలు, అనుచరులపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.


1993 నాటి ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2003లో అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం అతను పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా అండర్‌ వరల్డ్‌ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. దావూద్​కు చెందిన డీ కంపెనీని కూడా ఉగ్రవాద సంస్థగా 2003లో అమెరికా ప్రకటించింది. ఇటీవల దేశంలో పలు ఉగ్రదాడులకు దావూద్ ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. 


Also Read: Viral Video: మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటదో తెలుసా?- వైరల్ వీడియో


Also Read: Russia's Space Agency Chief: అర గంటలో నాటో దేశాల కథ ముగిస్తాం: రష్యా సంచలన వ్యాఖ్యలు