Rajapaksa Resigns: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిరసనలు హోరెత్తుతున్నాయి. రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆయన ఎట్టకేలకు రాజీనామా చేశారు.
ప్రతిపక్షం నో
శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స చేసిన ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ(ఎస్‌జేబీ) తిరస్కరించింది. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు సాజిత్ ప్రేమదాసను కోరుతూ రాజపక్స చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఎస్‌జేబీ ఇటీవల ప్రకటించింది.
నిరసన పర్వం
శ్రీలంకలో సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స కారణమంటూ వారు పదవి నుంచి వైదొలగాలని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.
ఈ నిరసనలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ ఇటీవల రెండు సార్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దానికి తోడు ప్రతిపక్షాలు అధికార పక్షంపై రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నాయి.
రాజపక్స రాజ్యం
శ్రీలంకను ఆర్థిక సంక్షోభం పూర్తిగా చుట్టుముట్టింది. దేశం రుణఊబిలో చిక్కుకోవడంతో పాటు నిత్యావసర వస్తువులు, రవాణాకు కీలకమైన పెట్రో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజపక్సల కుటుంబం దేశాన్ని దారుణంగా దోపిడి చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దాని ఫలితంగానే శ్రీలంక దివాలా తీసిందని విమర్శిస్తున్నారు.
శ్రీలంక హంబన్‌టొటకు చెందిన రాజపక్స కుటుంబం 1947 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పోడుజన పెరమున(శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్)కు చెందిన గొటబయ రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికే కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆయన సోదరులు చమల్ రాజపక్స, బసిల్ మంత్రులుగా, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రధానిగా పనిచేశారు.
గతంలోనూ మహీంద రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. మహీంద ఇద్దరు కుమారులైన నమల్, యోషితాలకు కీలకమైన పదవులు దక్కాయి. రాజపక్స కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకే బడ్జెట్‌లో 75 శాతం వరకు నిధులు కేటాయించడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది.
Also Read: Srilanka Financial Crisis Explained: లీటరు పెట్రోల్ 250..కిలో పాలపొడి 1400..| ABP Desam
Also Read: Arjuna Ranatunga About Srilanka Situation:శ్రీలంకలో గడ్డు పరిస్థితులకు ప్రభుత్వ విధానాలే కారణం