Vladimir Putin: రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ మాతృభూమిని కాపాడటం కోసమే ఈ యుద్ధం చేస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. రష్యా రాజధాని మాస్కోలో విక్టరీ డే సందర్భంగా పుతిన్ ప్రసంగించారు.
విక్టరీ డే
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏటా మే 9న 'విక్టరీ డే' పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మాస్కోలని రెడ్ స్క్వేర్ వద్ద పరేడ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యన్ సైనికులకు ఆయన నివాళులర్పించారు.
అర గంటలో
రష్యా విక్టరీ డే వేడుకల వేళ ఆ దేశ నేతల వ్యాఖ్యలు ప్రపంచాన్నే కలవర పెడుతున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కనుక అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని ఆయన హెచ్చరించారు.